రాంగ్ రూట్లో పోతే జైలుకే

రాంగ్ రూట్లో పోతే జైలుకే
  • ట్రాఫిక్ ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు నమోదు 
  •   రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
  •   యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు 
  •   గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెల రోజుల్లో 1,100 కేసులు 

హైదరాబాద్‌, వెలుగు: రాంగ్ రూట్ లో బండ్లు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ జైలు శిక్ష, జరిమానా పడేలా చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్స్ పెరిగిపోవడంతో వాటి నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. 

యూ టర్న్ ల దగ్గర, వన్ వే రూట్లలో వాహనదారులు రూల్స్ ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్ లో వెళ్తుండడంతో.. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. రూల్స్ ఉల్లంఘిస్తున్నోళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,100 కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్ లో 450, సైబరాబాద్ లో 350, రాచకొండలో 250కి పైగా కేసులు నమోదయ్యాయి. ‘‘హైదరాబాద్‌‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో యూటర్న్‌‌ లు, వన్‌‌ వేలు ఏర్పాటు చేశాం. అయితే ఇలాంటి ప్రాంతాల్లో వాహనదారులు రూల్స్ పాటించడం లేదు. యూటర్న్‌‌ల వద్ద రాంగ్ రూట్లలో ప్రయాణిస్తున్నారు. వన్‌‌ వేలపై ఇతర వాహనాలకు ఎదురుగా వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నారు. 

ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా పడేలా చూస్తున్నాం” అని పోలీసులు తెలిపారు.

వెహికల్స్, లైసెన్స్​లు సీజ్.. 

సాధారణంగా వాహనదారులు రాంగ్‌‌ రూట్ లో వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. ఇప్పటి వరకు కేవలం మోటార్ వెహికల్ (ఎంవీ) యాక్ట్ కింద జరిమానా వేసేవారు. కానీ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నది కాబట్టి.. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు‌‌ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ విధానం అమలు చేస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్తున్నోళ్లపై కేసులు నమోదు చేసి, కోర్టులో చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేస్తున్నారు. వెహికల్స్, డ్రైవింగ్ లైసెన్స్‌‌లు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు.

ఈ కేసుల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందంటున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటివి124 ప్రాంతాలను గుర్తించారు. ఈ కమిషనరేట్ పరిధిలో గత నెల రోజుల్లో మొత్తం 350 కేసులు నమోదు చేశారు. ఈ నెల 21న ఏకంగా 93 మందిపై ఎఫ్ఐఆర్ లు రిజిస్టర్ చేశారు. అత్యధికంగా గచ్చిబౌలి పీఎస్‌‌ పరిధిలో 32 మందిపై కేసులు పెట్టారు.  

క్రిమినల్ కేసులు పెడుతున్నం.. 

రాంగ్‌‌ సైడ్ డ్రైవింగ్​తో ప్రాణనష్టం జరుగుతోంది. ఎంవీ యాక్ట్‌‌ కింద కేసులు పెట్టినప్పటికీ వాహనదారుల్లో మార్పు రావట్లేదు. అందుకే రూల్స్ పాటించని వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి, కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నాం. ఈ కేసుల్లో జైలు శిక్షతో పాటు ఫైన్​ విధిస్తారు.  

– సత్యనారాయణ, ఏసీపీ, మాదాపూర్‌‌‌‌, సైబరాబాద్ కమిషనరేట్‌‌