అమెరికన్లపై దాడి చేస్తే ఇలాగే బదులిస్తం: బైడెన్

వాషింగ్టన్: ఇరాక్, సిరియా దేశాలపై అమెరికా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. రెండు దేశాల్లోని మిలిటెంట్​స్థావరాలు టార్గెట్​గా మొత్తం 85 చోట్ల బాంబుల వర్షం కురిపించింది. జోర్డాన్​లో గతవారం మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు అమెరికన్ సోల్జర్లను బలితీసుకున్నారు. దీనికి తప్పకుండా బదులిస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్​ అప్పుడే హెచ్చరించారు. తాజాగా అమెరికా సైన్యం ప్రతీకార దాడులు చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీఎస్) స్థావరాలతో పాటు ఆయుధ గిడ్డంగులు, కమాండ్  కంట్రోల్  ఆపరేషన్  థియేటర్లు, ఇంటెలిజెన్స్  సెంటర్లు, రాకెట్లు, మిసైల్స్, అన్ మ్యాన్డ్  ఏరియల్  వెహికల్  స్టోరేజీలు తదితర ప్రాంతాలపై డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టించింది.

మా జోలికి వస్తే ఇలాగే ఉంటది..

డ్రోన్ దాడులు చేసి తిరిగొచ్చిన అమెరికన్ సోల్జర్లను ప్రెసిడెంట్​ బైడెన్ ప్రత్యేకంగా అభినందించారు. డోవర్ ఎయిర్​ఫోర్స్ బేస్ కు వెళ్లి సైనికులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాకు ఓ స్టేట్​మెంట్ విడుదల చేశారు. ఇరాక్, సిరియాలలోని తీవ్రవాద గ్రూపుల స్థావరాలపై అమెరికా సోల్జర్లు ప్రతీకార దాడులు చేశారని, తన ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఇందులో పేర్కొన్నారు. గత ఆదివారం జోర్డాన్​లోని అమెరికా ఆర్మీ బేస్ పై జరిగిన దాడిలో ముగ్గురు సైనికులు చనిపోయారని చెప్పారు.  వారి మరణానికి ప్రతీకారంగానే ప్రస్తుతం దాడులు చేశామని, ఇకపైనా దాడులు కొనసాగిస్తామని బైడెన్ తేల్చిచెప్పారు. అమెరికా తనకుతానుగా వివాదాల జోలికి పోదని, ఎవరైనా మా జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని చెప్పారు. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా పౌరుడికి హానిచేస్తే మాత్రం కనీవినీ ఎరుగుని రీతిలో బదులిస్తామని హెచ్చరించారు.