అరకొర నిధులతో నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమా?

తెలంగాణలో గత ఎనిమిదేండ్ల నుంచి బడ్జెట్ ను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతున్నది. ఇదే సమయంలో ప్రతి కుటుంబంపై అప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. సంక్షేమ రాష్ట్రం అని ప్రభుత్వం చెబుతున్నా, రైతు ఆత్మహత్యలు ఇంకా కలవర పెడుతూనే ఉన్నాయి. విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. పేదవాడికి నాణ్యమైన ప్రభుత్వ వైద్యం దొరకడం లేదు. హామీలన్నీఎన్నికల వరకే ఉంటున్నాయి. హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో కీలకమైన విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తున్నది. ఇతర రాష్ట్రాల బడ్జెట్ తో పోలిస్తే కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఈసారి బడ్జెట్​లో విద్యారంగానికి రూ.19,093 కోట్లు(6.57%),  వైద్య రంగానికి రూ.12,161 కోట్లు(4.18% )మాత్రమే కేటాయించింది. గతంలో విద్యారంగానికి 6.74% కేటాయిస్తే ఈసారి ఆ మొత్తంలో కోత విధించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ బడ్జెట్​లో​ సగటున 15.12 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాయి. 10 శాతం లోపు నిధులు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ చివర్లో నిలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యమయ్యాయి. పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందడం లేదు కేటాయించిన నిధుల్లో కూడా వివక్ష చూపుతూ కేవలం విద్యారంగం అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే అన్నట్లుగా ఖర్చు చేస్తున్నది. ఇటీవల ‘మన ఊరు-– మన బడి’ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మూడు కోట్లకు పైగా నిధులు కేటాయించి కేజీ నుంచి పీజీ వరకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ హబ్​ను మంత్రి ప్రారంభించారు. ఇలాంటి విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా లేవు. విద్యార్థుల స్కాలర్​షిప్​లకు కేటాయింపులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేటాయించిన మొత్తాన్ని సకాలంలో విడుదల చేయడం లేదు. యూనివర్సిటీల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. రాష్ట్రంలో ఉన్న పన్నెండు వర్సిటీలకు ప్రభుత్వం బడ్జెట్​లో కేవలం రూ. 3000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం సిబ్బంది జీతాలకే సరిపోతాయి. ఇతర సౌకర్యాలకు నిధులు మిగలవు. నూతన హాస్టళ్ల నిర్మాణం లేక శిథిల భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

పంచాయతీలకూ అరకొరే..

నిరుద్యోగులకు ఈ బడ్జెట్ లోనూ నిరాశే ఎదురైంది. నిరుద్యోగ భృతికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. గిరిజన బంధు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ లాంటి పథకాలకు పెద్దగా కేటాయింపులేమీ లేవు. గతంలో ప్రకటించిన కేటాయింపులనే ఈసారీ రిపీట్ చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చాలామంది సర్పంచులు అభివృద్ధి పనులకు డబ్బులు ఖర్చు పెట్టి, వాటి బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ బడ్జెట్​లో గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై సరాసరి ఐదు లక్షల వరకు అప్పు ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నది. బడ్జెట్​లో ఎక్కువగా అనుత్పాదక రంగాలకే ఎక్కువ మొత్తంలో కేటాయించింది. ఈ బడ్జెట్ మొత్తం కూడా అంకెల గారడితో మేడిపండు చందంగా ఉంది.

పంటల బీమా ఏది?

రాష్ట్రాలు వైద్యరంగానికి వాటి బడ్జెట్​లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలని 2020 నాటి నేషనల్ హెల్త్ పాలసీ సిఫారసు చేసింది. చాలా రాష్ట్రాలు ఈ సిఫారసులకు చేరువలో ఉండగా మన రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది. ఈ ఏడాది వైద్యరంగానికి బడ్జెట్​లో 4.18 శాతం నిధులను కేటాయించింది. ఈ మొత్తంతో ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చెందడం సాధ్యమైన పని కాదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవడం స్వరాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నది. మన రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలోనే ఉంది. ఈసారి బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రూ. 26,831 కోట్లను కేటాయించింది. గతంలో రైతులకు లక్షల్లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించినా, అది ఆచరణ సాధ్యం కాలేదు. ప్రస్తుతం16 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో ఎగవేతదారులుగా మారారు. ప్రస్తుతం కేటాయించిన రైతు రుణమాఫీకి రూ. 6,385 కోట్లు ఏమాత్రం సరిపోవు. పాత బాకీ కట్టలేక, కొత్త అప్పు పుట్టక లక్షల మంది రైతులు పెట్టుబడి ఖర్చుకు వడ్డీ వ్యాపారుల దగ్గరకెళ్లి అప్పుల పాలవుతున్నారు. ఈ బడ్జెట్ లో నైనా పంట నష్టానికి సంబంధించి బీమా పథకం పెడతారని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం పెట్టలేదు. చాలా రాష్ట్రాలు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నది. కానీ మన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ బడ్జెట్​లో కౌలు రైతులను ఆదుకోవడానికి ఎలాంటి విధానాలను ప్రకటించలేదు. 

- డా.చింత ఎల్లస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ