ఎఫ్బీలో యాడ్​ను నమ్మి పెట్టుబడి పెడ్తే.. రూ. 2.15 కోట్లు హాంఫట్!

ఎఫ్బీలో యాడ్​ను నమ్మి పెట్టుబడి పెడ్తే..   రూ. 2.15 కోట్లు హాంఫట్!
  • నకిలీ స్టాక్ మార్కెట్​లో పైసలు పెట్టి మోసపోయిన టెకీ
  • 1930కి కాల్ చేసి రూ. 28 లక్షలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు 
  • లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని హెచ్చరిక 

సంగారెడ్డి, వెలుగు: ‘‘కొంతకాలం కిందట స్టాక్ మార్కెట్​లో ఫలానా కంపెనీ షేర్లు కొన్నవారు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. మీరు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు గడించాలని అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి.. మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. 

కొద్ది రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోండి’’.. ఇలాంటి ప్రకటనలు ఇటీవల ఫేస్​బుక్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై హోరెత్తిపోతున్నాయి. పొరపాటున ఈ ప్రకటనలను నమ్మి అందులో చెప్పినట్టు పెట్టుబడులు పెట్టారనుకోండి.. ఇక మీ డబ్బులు పోయినట్టేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా పటాన్​చెరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా ఇలాంటి ప్రకటననే నమ్మి నకిలీ స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ. 2.15 కోట్లు పోగొట్టుకున్నాడని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి శనివారం వెల్లడించారు. 

22 విడతల్లో రూ. 2.43 కోట్లు.. 

పటాన్​చెరు ఏపీఆర్ హోమ్స్​లో నివాసముంటున్న సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగికి జూన్​లో ఫేస్​బుక్​లో ఓ ప్రకటన కనిపించింది. తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆ ప్రకటనలో ఆశచూపారు. ఆ సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన అతడు ప్రకటనలో చెప్పినట్టుగా లింక్ పై క్లిక్ చేసి మోతీలాల్ ఓస్వాల్ స్ట్రాటజీ గ్రూప్(ఎం4) పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్​లో చేరాడు. 

ఆ వాట్సాప్ గ్రూపులో వచ్చే ప్రకటనలను, సూచనలను నమ్మి మోసగాళ్లు చెప్పినట్టుగా జూన్ 19 నుంచి ఆగస్టు 2 వరకు 22 విడతల్లో మొత్తం రూ.2,43,25,000 పెట్టుబడులు పెట్టాడు. అతడి అకౌంట్​లో రోజురోజుకూ డబ్బులు భారీగా పెరుగుతున్నట్టుగా సైబర్ క్రిమినల్స్ చూపించారు. చివరకు పెట్టిన పెట్టుబడి లాభాలతో కలిపి రూ.6 కోట్లకు చేరినట్టు కనిపించడంతో డబ్బును విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. 

కానీ రూపాయి కూడా విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పటాన్ చెరు సైబర్ క్రైమ్ పోలీసులు1930కి కాల్ చేసి రూ.28 లక్షలను మాత్రం ఫ్రీజ్ చేయించగలిగారు. 

మోసపోతే 1930కి కాల్ చేయాలి..  

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నా వరుస ఘటనలతో బాధితులు పెరుగుతుండటం ఆందోళనకరం. వ్యాపారస్తులు, సాధారణ వ్యక్తులే కాకుండా ఐటీ ఉద్యోగులు సైతం సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధిక లాభాల ఆశతో అనామక యాప్ లలో పెట్టుబడులు పెట్టొద్దు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే.. వెంటనే 1930కి కాల్ చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.  - ప్రవీణ్ రెడ్డి, సీఐ, పటాన్​చెరు