సంస్థాన్ నారాయణపురం వెలుగు: 'తిన్నరేవు మరవక కేసీఆర్ కారు గుర్తుకే ఓటెయ్యి’ అని మంత్రి గంగుల కమలాకర్అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గొర్రెల కాపరులను, ముసలి వాళ్లను, రైతులను, మెకానిక్‌లను కలిశారు. గొర్రెల కాపరిని కలిసిన మంత్రి 'ఇది కేసీఆర్ గొర్రె.. నీకు రెండు యూనిట్లు ఇచ్చిన్రా.? ఆటికి పిల్లలు పుట్టినయా.? తిన్నరేవు మరవకు. కేసీఆర్ కారు గుర్తుకే ఓటెయ్యి’ అని కోరారు. సదరు కాపరి మాత్రం 'నాకు అప్పుడొక్కసారే ఇచ్చిన్రు.
ఇప్పుడియ్యలే' అంటూ సమాధానమిచ్చారు. మెకానిక్గ్యారేజీ వద్దకు పోయిన మంత్రిని 'కార్పొరేషన్ నుంచి ఏదైనా లోన్ఇప్పించండి’ అని మెకానిక్ అనగానే.. 'అప్లయ్ చేసుకో..లోన్లు కాదు అంతా గ్రాంటే నాలుగైదు లక్షలు ఇస్తం ఫ్రీగా. మళ్లా ఒక్క పైసా కట్టేదీ ఉండదు’ అని మంత్రి చెప్పుకొచ్చారు. రైతుల వద్దకు పోగానే.. వడ్ల మంత్రి వచ్చిండని వారికి పరిచయం చేశారు. సదరు రైతులను వడ్ల పైసలొచ్చియా? అని ప్రశ్నించిన మంత్రి 'కారు గుర్తుకు ఓటెయ్యి. టక్కటక్క వడ్ల పైసలు వేయిస్తా” అని చెబుతూ వెళ్లారు.