ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం సరైనది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం మంచిది కాదన్నారు.
కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పాలనపై బీజేపీకి పార్టీకి, ప్రధాని మోదీకి ఏ మాత్రం గౌరవం లేదని మంత్రి విమర్శించారు.
మాజీ ప్రధాని మన్మోసింగ్ గతంలో మాట్లాడిన వీడియోను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలించిందని ప్రజలంతా గమనించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు.