కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే తపన లేదని, కాంట్రాక్టు కోసమే బీజేపీలోకి చేరాడని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ మండలం గట్టుప్పల్ లో రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు, డప్పు చప్పుళ్ల నడుమ సంబరాలు నిర్వహించారు. అనంతరం కొత్త మండలానికి తహసీల్దార్ గా పులి సైదులు, ఎస్ఐగా సురేష్ నియమితులయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ గోపాల్ రెడ్డి రాజీనామా అర్దం లేనిదని మంత్రి విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారన్న ఆయన.. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే ఇంటింటికీ తాగు నీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు పారుతుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. ఇదిలా ఉండగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశామని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. గట్టుప్పల్ ప్రజల 37 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించినట్లయ్యిందని తెలిపారు.