- మార్కెట్ వాల్యూ పెంపు ఎఫెక్ట్‌తో జనానికి ఇంకిన్ని తిప్పలు
హైదరాబాద్, వెలుగు: త్వరలో పెరగనున్న భూముల మార్కెట్ వాల్యూ ప్రభావం ఇంటి నిర్మాణ అనుమతులపై తీవ్రంగా పడనుంది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లలో బిల్డింగ్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే చెల్లించాల్సిన ఓపెన్ స్పేస్ చార్జీలు, పెనాల్టీలు నిర్మాణదారులకు భారంగా మారనున్నాయి. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల ఓనర్లు బిల్డింగ్ పర్మిషన్ కోసం మున్సిపాలిటీలకు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు, ఆ ఓపెన్ స్పేస్ చార్జీలపై 33 శాతం పెనాల్టీని మార్కెట్ వాల్యూ బేస్డ్ గానే చెల్లించాల్సిన విషయం తెలిసిందే. మార్కెట్ వాల్యూ పెరిగితే మున్సిపాలిటీల పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ కు చెల్లించే మొత్తం కనీసం రూ. 50 వేల నుంచి 3 లక్షలు పెరగనుంది. అలాగే ఖాళీగా ఉన్న ప్లాట్లపై విధించే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) కూడా పెరగనుంది. ఇవన్నీ పెరిగితే బిల్డర్స్ కన్ స్ట్రక్షన్ చేసి అమ్మే ఇండ్లు, ప్లాట్ల ధరలు కూడా పెరగనున్నాయి. అలాగే సొంతంగా ఎవరైనా ఇండ్లు కట్టుకోవాలన్నా బడ్జెట్ పెరగనుంది.
వీఎల్టీ పేరిట ఖాళీ ప్లాట్లకు వసూళ్లు
ఖాళీ ప్లాట్లకు వాటి మార్కెట్ విలువలో 0.5 % ఏటా ట్యాక్స్ గా స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెల్లించాలని.. ఇట్లా కట్టిన రశీదు ఉంటేనే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్ (జీ/2280/2017) జారీ చేసింది. దీని ప్రకారం రూ. 10 లక్షల మార్కెట్ విలువ ఉన్న ప్లాటుకు రూ. లక్షకు రూ. 500 చొప్పున ఏటా రూ. 5,000 ట్యాక్స్ చెల్లించాలి. మున్సిపాలిటీ వసూలు చేసే ఇంటి పన్ను కంటే ఇది ఎక్కువే. 2017 ఏప్రిల్ 17 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఈ ఉత్తర్వులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర మున్సిపల్ చట్టం–2019లోనూ సర్కార్ పలు సెక్షన్లను చేర్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపు నిర్మాణ పర్మిషన్లు ఇవ్వదగిన ఖాళీ జాగాలన్నింటిని గుర్తించి ట్యాక్స్ విధించాలన్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్ ఆర్ఎస్ కోసం వేచి చూస్తున్న 14.75 లక్షలకు పైగా ప్లాట్ల ఓనర్లు వీఎల్టీ నుంచి తప్పించుకోలేరు. రిజిస్ట్రేషన్ టైమ్‌లోనో, ఇంటి పర్మిషన్ టైమ్‌లోనో ట్యాక్స్ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా నిర్మాణదారులకు భారంగా మారనుంది.
హైదరాబాద్‌లో 200 గజాల జాగా ఉంటే ..
మార్కెట్ వాల్యూ పెరిగాక ఎల్ఆర్ఎస్ లేని ప్లాటులో ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కోసం ఎవరైనా మున్సిపాలిటీలో అప్లయ్ చేసుకుంటే వారికి ఖర్చు తడిసి మోపెడు కానుంది. కొత్త మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే వారి నుంచి 14 శాతం ఓపెన్ స్పేస్ (షార్ట్ ఫాల్) చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలపై 33 శాతం కాంపౌండింగ్ ఫీ(పెనాల్టీ) వసూలు చేయనున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడలో ప్రస్తుతం చదరపు గజానికి మార్కెట్ వ్యాల్యూ రూ.10,500 ఉంది. ఉదాహరణకు అక్కడ ఒక వ్యక్తికి ఎల్ఆర్ఎస్ లేని 200 చ. గజాల(167 చ.మీ.) ప్లాటు ఉందనుకుంటే.. దాని మార్కెట్ వాల్యూ రూ. 21 లక్షలు అవుతుంది. ఈ మొత్తంలో 14 శాతాన్ని ఓపెన్ స్పేస్ చార్జీలుగా రూ. 2,94,000, అలాగే ఓపెన్ స్పేస్ చార్జీల్లో 33 శాతం పెనాల్టీ చార్జీలు రూ. 97,020 కలిపి మొత్తం రూ.3,03,029 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్లాట్ల మార్కెట్ వాల్యూ మినిమం 30 శాతం నుంచి 200 శాతం పెరగబోతున్నాయి. తక్కువలో తక్కువగా 30 శాతం మార్కెట్ వాల్యూ పెరిగినా బిల్డింగ్ పర్మిషన్ కోసం బోడుప్పల్ లో 200 గజాల్లో ఇంటి పర్మిషన్ కోసం రూ.4 లక్షలపైనా చెల్లించాల్సి ఉంటుంది.
ఓపెన్ స్పేస్ చార్జీల వసూలు నిలిపివేయాలి
భూముల మార్కెట్ విలువ పెంచడంతో మున్సిపాల్టీలకు ఎల్ఆర్ఎస్ చార్జీల పేరిట చెల్లించాల్సిన ఓపెన్ స్పేస్ చార్జీలు, కాంపౌండింగ్ ఫీజు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇండ్ల పర్మిషన్ కే రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. అందుకే పట్టణాల్లో ఎల్ఆర్ఎస్ చార్జీల వసూలును నిలిపివేయాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గించాలి. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసి నామమాత్రపు ఫీజుతో రెగ్యులరైజేషన్ చేయాలి.
- నారగోని ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్