రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే..హద్దులు దాటొద్దు : పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌ దిలీప్‌‌ రెడ్డి

తమిళనాడు గవర్నర్‌‌ ఆర్‌‌.ఎన్‌‌.రవి అసెంబ్లీలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ప్రభుత్వం రూపొందించిన లిఖిత ప్రసంగంలోని పదాలు, వాక్యాలు ఇష్టానుసారం వదిలి, దాటవేయడమే కాకుండా, సమావేశం ముగియకముందే మధ్యలోనే నిష్క్రమించి సభా సంప్రదాయాన్నీ భంగపరిచారు. దాన్ని అక్కడికక్కడే ఖండించడంతో పాటు సీఎం స్టాలిన్‌‌, ఆ వైఖరికి వ్యతిరేకంగా అదే సభలో తీర్మానం చేయించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్‌‌కి మధ్య అనారోగ్యకర స్పర్ధకు ఇది పరాకాష్ట. ఇలాంటి వివాదాలు కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌‌ వంటి రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఉన్నాయి. ఇవన్నీ బీజేపీయేతర పక్షాలు పాలించే రాష్ట్రాలు కావడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల వివాదాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇది ఫెడరల్‌‌ స్ఫూర్తికి భంగకరమనే వాదన ఉంది. కేంద్రం – రాష్ట్రాల మధ్య సయోధ్య, సత్సంబంధాల కోసం పనిచేయాల్సిన ఒక రాజ్యాంగ(గవర్నర్ల) వ్యవస్థ, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగమౌతోందన్న విమర్శ పాతదే! తెలంగాణలో గవర్నర్‌‌ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వానికి పడటం లేదు. గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి సీఎం ప్రతిపాదించిన కౌశిక్‌‌రెడ్డి అభ్యర్థిత్వంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన దరిమిలా ఈ వివాదం బలపడింది. ప్రభుత్వం, పనితీరుపై వ్యాఖ్యలే కాకుండా పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకుంటున్నారన్నది పాలకపక్షం బీఆర్‌‌ఎస్‌‌ అభియోగం. గవర్నర్‌‌గా ఆమెకు కనీస ప్రొటోకాల్‌‌ పాటించకపోవడం నుంచి మంత్రులు, ఇతర ముఖ్యనేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆమెను కించపరచడం వరకూ వ్యవహారం వెళ్లింది. నెహ్రూ కాలం నుంచీ గవర్నర్ల ‘సేవల’ వాడకంపై విమర్శలున్నాయి. గవర్నర్లను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాతిక, ముఫ్పై రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమో, సీఎంలను మార్చడమో చేశారని ఇందిరాగాంధీపై విమర్శలున్నాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై పనిచేసిన రాజమన్నార్‌‌ కమిషన్‌‌, సర్కారియా కమిషన్లు కూడా రాజకీయేతర ముఖ్యుల్నే గవర్నర్లుగా నియమించాలని ప్రతిపాదించాయి. 1969, తొలి పాలనా సంస్కరణల కమిటీ కూడా సీఎంలను సంప్రదించే గవర్నర్లను వేయాలంది. వివాదం వచ్చినపుడు పరస్పరం విమర్శించుకోవడం, తర్వాత మిన్నకుండటం కాకుండా ఓ ఆరోగ్యకరమైన చర్చ జరపాలి. అవసరమైతే ఆ మేర రాజ్యాంగ సవరణ జరగాలి.

తెగని సమస్యతో ఎంతకాలం?

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం విషయంలో సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తరచూ పంచాయితీ వస్తోంది. ఫలితంగా నియామకాల్లో జాప్యం జరుగుతున్నది. ‘కొలీజియం ఒకటి, రెండు సార్లు సిఫారసు చేశాక కూడా, వాటిని ఆమోదించి పంపకుండా కేంద్రం చేస్తున్న అనుచిత జాప్యాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయ’ని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. సహాయ నిరాకరణ అలాగే సాగుతోంది. దానికి తోడు ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి పెద్దలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సుప్రీం ధర్మాసనం ఆగ్రహించింది. న్యాయమూర్తుల్ని నియమించేందుకు కేంద్రం 2014లో, 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘నేషనల్‌‌ జుడీషియల్‌‌ అపాయింట్​మెంట్‌‌ కమిషన్‌‌’ (ఎన్‌‌జేఈసీ)ను ఏర్పాటు చేసింది. అది రాజ్యాంగబద్ధం కాదు, చెల్లదని సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. కొలీజియమే కొనసాగాలంది. ‘ఈ వ్యవస్థలోనూ లోపాలున్నాయి, పారదర్శకం కాదు. తమను తామే నియమించుకునే వ్యవస్థ రాజ్యాంగంలో ఇంకెక్కడా లేదు, ఇది సరికాదు’ అని న్యాయశాఖ మంత్రి కిరణ్‌‌ రిజిజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరో సందర్భంలో... ‘ఇంకో వ్యవస్థ వచ్చే వరకు ఇదే ఉంటుంది, కాదనను, కానీ, ఏదీ సరిగా చూడకుండానే సంతకాలు చేయలేం’ అని చేసిన వ్యాఖ్యలపై సుప్రీం మండిపడింది.  కొలీజియం పంపిన 20 ఫైళ్లను, అభ్యంతరాలతో కేంద్రం వెనక్కి పంపింది.‘చట్టం చేసుకునే అధికారం శాసనవ్యవస్థ ద్వారా కేంద్రానికి ఉండొచ్చు, కానీ, ఈ విషయంలో తుది మధ్యవర్తిగా కోర్టులుండాలని రాజ్యాంగమే చెబుతోంది’ అన్నది సుప్రీం కోర్టు భావన. తగిన సంఖ్యలో జడ్జీలు లేక అన్నిస్థాయిల్లో కలిపి ఇపుడు దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. గొడవ ఎవరికి? నష్టపోతున్నదెవరు?

స్థానిక సంస్థల్ని చంపేస్తున్నారు

స్థానిక స్వపరిపాలన ప్రజాస్వామ్యం బలోపేతానికి ఊతం. పనిగట్టుకొని పాలకులు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. నిధులు, అధికారాల బదలాయింపు ఒట్టి బుకాయింపులే తప్ప నిజాయితీ లోపిస్తోంది. దాంతో, రాష్ట్ర ప్రభుత్వానికి – స్థానిక సంస్థలకు మధ్య నిత్యపోరాటం తప్పటం లేదు. నిధుల కేటాయింపు, వసూలైన పన్నుల్లో వాటా పంపిణీ, రుణపరిమితి వంటి విషయాల్లో నిత్యం కేంద్రంతో కొట్లాడే రాష్ట్ర ప్రభుత్వాలు, మరోపక్క స్థానిక సంస్థల పట్ల కనీస ఉదారత లేకుండా వ్యవహరిస్తాయి. బాధ్యతను విస్మరిస్తున్నాయి. అందుకు తెలంగాణ ఏమీ మినహాయింపు కాదు. ఇక్కడ మునుపెన్నడు లేని రీతిలో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిలేక రొడ్డెక్కారు. చేసిన పనులకు బిల్లులు లేక ఆందోళనలు, ఊరేగింపులు, నిరాహారదీక్షలు.. ఒకటని కాదు, ఎన్నో రీతుల్లో ఉద్యమిస్తున్నారు. టోకెన్‌‌ నిరసనగా కొందరు సర్పంచులు భిక్షమెత్తుకున్నారు. ఇంకొందరు ఆత్మహత్యలకు తలపడ్డారు. గ్రామ పంచాయతీలకు, ఇతర స్థానిక సంస్థలకు నిధులు కేటాయించటం లేదు. పెండింగ్‌‌ బిల్లులతో ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు బకాయిలున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కూడా రాష్ట్ర సర్కారు దారిమళ్లిస్తోంది. కింది స్థాయిలో డిజిటల్‌‌‘కీ’ వాడి డబ్బును ఇతర అవసరాలకు కాజేస్తున్నారు. ఇదంతా వారు ఎన్నికల హామీకి విరుద్ధం. ఆరు దశాబ్దాల వలస పాలనలో వివక్ష, అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి వస్తే 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి లోబడి, నిధులు, అధికారాల బదలాయింపుతో స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తామని బీఆర్‌‌ఎస్‌‌ 2014 తన ఎన్నికల ప్రణాళిక(పేజీ:25)లో విస్పష్టంగా పేర్కొంది. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాలకపక్ష ప్రజాప్రతినిధులే మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇతర విభాగాలను గౌరవిస్తూ, అధికారాలు, పరిధులను గుర్తించి, వాటికి లోబడి పనిచేస్తేనే రాజ్యాంగ ఫలాలు సామాన్యునికి దక్కేది!

అంతిమంగా నష్టపోతున్నది సాధారణ ప్రజానీకమే!

రాజ్యాంగ వ్యవస్థల నడుమ సరిహద్దు వివాదాలు ప్రమాదకరంగా ముదురుతున్నాయి. శాసన వ్యవస్థకి – న్యాయ వ్యవస్థకి మధ్య, రాజ్యాంగ సంస్థలకి – పాలనా వ్యవస్థకి మధ్య, కేంద్ర–రాష్ట్ర–స్థానిక ప్రభుత్వాల నడుమ కూడా పలు వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ గొడవల స్థితి పనిపరంగా ఒకరకమైన ప్రతిష్టంబనకు దారితీస్తున్నది. ఇది పరస్పర అతిక్రమణలు, దురాక్రమణల పుణ్యమే తప్ప రాజ్యాంగంలో ఏ అస్పష్టతా లేదు. ప్రజాస్వామ్యపు ముఖ్య విభాగాలన్నిటి మధ్య స్పష్టమైన విభజన ఉంది. అధికారాలు, విధులు, పరిధులు, పరిమితులకు సంబంధించి, దేనికదిగా స్పష్టమైన విభజన ఏర్పరచి రాజ్యాంగాన్ని సమ్యక్‌‌ దృష్టితో మన పెద్దలు సమగ్రంగా తీర్చిదిద్దారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవిగా నిర్వచిస్తూనే, పరస్పరం ఆధారపడటం – పర్యవేక్షించుకోవడం సాధ్యమయ్యేలా విధానాలను రూపొందించారు. కానీ, వ్యవస్థలు అక్కడక్కడ కట్టుదప్పుతున్నాయి. లక్ష్మణరేఖల్ని దాటి ఇతరుల పని పరిధుల్లో (డొమైన్లలో) కి చొరబడటం సమస్యలకు దారితీస్తోంది. గవర్నర్లు – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి తమిళనాడు తాజా పంచాయితీ నిదర్శనం. కేరళ, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌‌, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి వివాదాల్ని చూస్తున్నాం. న్యాయమూర్తుల నియామకం, కొలీజియం సిఫారసులు వంటి కీలక విషయాల్లో న్యాయవ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంట రాజుతోంది. జీఎస్టీ, ఇతర నిధుల వాటా వివాదాల నుంచి సీబీఐ–ఈడీ వంటి సంస్థల వినియోగం వరకు కొన్ని రాష్ట్రాలు – కేంద్ర ప్రభుత్వం మధ్య నిత్య ఘర్షణ మామూలైంది. సమాఖ్య (ఫెడరల్‌‌) రాజ్య స్ఫూర్తి సందిగ్ధంలో పడింది. నిధులు, అధికారాల బదలాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి–స్థానిక సంస్థలకు మధ్య పిల్లి – ఎలుక పోరు. పరస్పర సహకారంతో, ఎవరి పరిధుల్లో వారుండి పనిచేసుకోవాల్సిన రాజ్యాంగ విభాగాలు అక్కడక్కడ గీత దాటి రోత పుట్టిస్తున్నాయి. ఈ రాద్ధాంతాల వల్ల అంతిమంగా నష్టపోతున్నది సాధారణ ప్రజానీకమే!

- దిలీప్‌‌ రెడ్డి,
పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, 
పీపుల్స్‌‌పల్స్‌‌ సంస్థ