బనిహాల్: గాడ్సే భారత్ తమకు వద్దని, గాంధీ ఇండియానే కావాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. లోయలోని ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని, గుర్తింపును తిరిగి పొందాలనుకుంటున్నారని బనిహాల్లోని నీల్ అనే గ్రామంలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆమె చెప్పారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలంటే కేంద్రం వెంటనే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్నారు.
70 నెలలైనా పోరాటం ఆపబోం
‘మహాత్మా గాంధీ భారత్ లోనే మేం ఉండాలనుకుంటున్నాం. ఆ భారత్ లో మాకు ఆర్టికల్ 370తోపాటు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా ఉండేవి. గాడ్సే ఇండియాలో మేం బతకలేం. మా నుంచి అన్నీ లాక్కుంటే మేం కూడా మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది’ అని ముఫ్తీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ఈ దేశంలో ఉండాలా వద్దా అనేది కేంద్ర సర్కార్ నిర్ణయించుకోవాలన్నారు. కశ్మీర్ కావాలనుకుంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని హెచ్చరించారు. ‘మా తలలపై తుపాకులు పెట్టి పాలించలేరు. అఫ్గానిస్థాన్ మీద ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న సూపర్ పవర్ అమెరికానే ఫెయిల్ అయ్యింది. అంత శక్తి ఉన్నప్పటికీ యూఎస్.. అఫ్గాన్ ను విడిచి వెళ్లక తప్పలేదు. బ్రిటిషర్ల నుంచి భారత్ కు స్వాతంత్ర్యం రావడానికి 200 ఏళ్లు పట్టింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి బీజేపీకి 70 సంవత్సరాలు పట్టింది. 70 నెలలైనా ఫర్వాలేదు.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించుకుందాం, పోరాటాన్ని ఆపొద్దు’ అని మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు.