నన్ను కలవాలంటే ఆధార్ కార్డుతో రండి : ఎంపీ కంగనా రనౌత్​

  •  మండి నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కంగనా రనౌత్​ సూచన

న్యూఢిల్లీ: మండి నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చేవారు తమ ఆధార్ కార్డులను వెంట తెచ్చుకోవాలని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కోరారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై వివాదం రేగింది. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'హిమాచల్​ప్రదేశ్​కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే నన్ను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమవెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. కారణం ఏమిటనేది ఓ పేపర్ పై రాసివ్వాలి.

 దానివల్ల ఎవరికీ ఎలాంటి అసౌకర్యం ఉండదు' అని కంగన సూచించారు. మనాలిలోని నివాసంలో లేదా మండిలోని ఆఫీసులో.. ఎక్కడైనా తనను కలవొచ్చని చెప్పారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీని కలుసుకోవాలంటే ఆధార్ కార్డుతో అవసరం ఏంటని కాంగ్రెస్ నేత, హిమాచల్​ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ నిలదీశారు.