రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఎన్నో రకాల చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ లో భాగంగా…ద్విచక్రవాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని…లేదంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. అయినా కొందరు పట్టించుకోకుండా ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ ను మరింత కఠినం చేశాయి. ముఖ్యంగా బైక్ కొనాలన్నా హెల్మెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.
ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. బండి కొనాలన్నా.. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలన్నా రెండు హెల్మెట్లు తప్పనిసరిగా కొనాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. రెండు హెల్మెట్లు కొన్న వారికే బండిని అమ్మాలని షో రూం యజమానులను ఆదేశించింది.
బైక్ నడిపేవారు, వారి వెనుకాల కూర్చునే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు తీసుకొచ్చామన్నారు ఆ రాష్ట్ర రవాణా కమిషనర్ శైలేంద్ర శ్రీవాత్సవ. రెండు హెల్మెట్లు కొన్నవారికే బైక్‌ను అమ్మాలని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకం దారులకు ఆదేశించామన్నారు. అంతేకాదు.. హెల్మెట్లు కొన్న రశీదు చూపించినవారికే బండి రిజిస్ట్రేషన్ చేయాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వాహనదారులు ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్లనే వాడాలని సూచించారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి.