మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : ఫర్టిలైజర్ డీలర్లు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా కావాలంటే కచ్చితంగా గుళికల మందు కొనాలని కండిషన్ పెడుతున్నారు. లేకుంటే సంచులు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. టైం దాటిపోతే పంట దిగుబడిపై ప్రభావం చూసే ప్రమాదం ఉండడంతో చేసేది లేక రైతులు యూరియాతో పాటు గుళికల మందు కూడా కొంటున్నారు. డీలర్లు యూరియాను కూడా రూ.70 నుంచి రూ. 80 అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 1.88 లక్షల ఎకరాల్లో వరి సాగు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ యాసంగిలో 1,23,176 మంది రైతులు 1,88,830.25 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. జనవరి నుంచి వరి నాట్లు వేసుకోగా, ప్రస్తుతం పంటలు 50 రోజుల నుంచి 60 రోజులకు వచ్చాయి. ఇప్పటికే నాట్లు వేసిన 25 రోజుల తర్వాత రైతులు పొలాల్లో గుళికల మందును చల్లుకున్నారు. ప్రస్తుతం చేన్లు ఎదుగుదలకు వచ్చాయి. మరో 15 రోజుల్లో పొట దశకు రానున్నాయి. ఈ పంటలు బలంగా ఎదిగేందుకు రైతులు యూరియా చల్లుకోవాలి. దీన్ని ఫర్టిలైజర్ డీలర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. వారి వద్ద ఉన్న గుళికల మందు స్టాక్‌ను ఎలాగైనా అమ్మాలని కంపెనీలు ఒత్తిడి చేస్తుండడంతో రైతులకు అంటగడుతున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా గుళికల మందులు కొనాలని, లేకుంటే యూరియా ఇవ్వమని ముఖం మీదే చెబుతుండడంతో చేసేది లేక రైతులు కొంటున్నారు.
సంచికి రూ.300 నుంచి రూ.330
యూరియా బస్తాకు రూ.260 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల మేర స్టాక్ ఉన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. సహకార సంఘాల వద్ద ఇదే ధరను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హమాలీ ఖర్చు కింద రూ.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సాగు కోసం అప్పులు చేసిన రైతులు ఫర్టిలైజర్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు రైతుకు అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్నారు. బస్తాకు రూ.260కి బదులు రూ.300 నుంచి రూ.330కి అమ్ముతున్నారు. పేరు మోసిన రెండు కంపెనీల సెంటర్ల వద్ద కూడా రూ.275కి బస్తా యూరియాను రైతులకు అమ్ముతున్నారు.
షాపులపై పర్యవేక్షణ కరువు
ఫర్టిలైజర్షాపులపై పర్యవేక్షణ కరువైంది. కొద్ది కాలంగా ఫర్టిలైజర్, స్ర్పే మందులను అధిక రేట్లకు డీలర్లు రైతులకు అమ్ముతున్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. నెలలో కనీసం ఒకసారి కూడా దుకాణాలను తనిఖీలు చేయడం లేదు. అధిక రేట్లను మందులు విక్రయితున్నారని కొన్ని సందర్భాల్లో రైతులు ఫిర్యాదు చేస్తే తప్ప, ఆఫీసర్లు స్పందించడం లేదు. దీనికితోడు జిల్లాస్థాయిలో ఉండే కొందరు ఆఫీసర్లు, డీలర్లకు మధ్య లావాదేవీలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే వ్యాపారులు బహిరంగంగా అధిక రేట్లను యూరియా అమ్ముతున్నా చర్యలు తీసుకోవడం లేదనే రైతులు ఆరోపిస్తున్నారు.
నాలుగైదు షాపులు తిరిగిన
యూరియా కోసం శుక్రవారం మధ్యాహ్నం దేవరకద్రకు పోయిన. నాలుగైదు ఫర్టిలైజర్షాపుల వద్దకు వెళ్లి బస్తాలను అడిగితే స్టాక్ లేదని చెప్పిండ్రు. చివరకు ఓ షాపులో స్టాక్ఉందని అన్నరు. కానీ, గుళికల మందులు కొంటేనే బస్తాలు ఇస్తామని చెప్పిన్రు. చేసేది లేక మూడు బస్తాల యూరియాతో పాటు మూడు ప్యాకెట్ల గుళికల మందును కొన్నా. ఒక్కో గుళికల మందు ప్యాకెట్‌కు రూ.500ల చొప్పును మూడు ప్యాకెట్లను రూ.1,500 ఇచ్చిన. యూరియా బస్తాకు రూ.300 చొప్పున రూ.900 ఇచ్చిన.
- సుదర్శనాచారి,
అమ్మాపూర్, చిన్నచింతకుంట మండలం
ఎవరూ ఫిర్యాదు చేయలేదు
యూరియాను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, గుళికల మందు కొంటేనే యూరియా సంచులు ఇస్తామని డీలర్లు చెబుతున్నట్లు మాకు రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల మేర యూరియా స్టాక్ ఉంది. ఆఫీసర్లను ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయమని చెబుతాం. అధిక రేట్లకు, అనవసరంగా గుళికల మందును రైతులకు అంటగడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
- వెంకటేశ్వర్లు,
జిల్లా వ్యవసాయాధికారి, మహబూబ్‌నగర్