2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం, ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని ప్రస్తుత రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. దీని ప్రకారం.. సేకరించే భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల వరకు అదనంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాభివృద్ధి కోసం సేకరించినట్లయితే ఆ భూమిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో యజమానులకు 20 శాతం భూమి ఇవ్వాలి. ఇక పరిశ్రమలకు అయితే 25 శాతం వాటా ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే ప్రభుత్వ మార్కెట్విలువలు బాగా తక్కువగా ఉండడంతో నాలుగు రెట్లు చేసినప్పటికీ కూడా రైతులకు బహిరంగ మార్కెట్ ధర మొత్తం రావడం లేదు. ఇది కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది.
ఇప్పటికే భూసేకరణ చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో మార్కెట్విలువలు సవరించి.. బహిరంగ మార్కెట్ రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూములు ఉన్నాయి. గతంలో రూ.లక్ష, రూ.రెండు లక్షలలోపే ఉన్న ఎకరం భూముల ధరలను రూ.7–9 లక్షల వరకు ప్రభుత్వం సవరించింది. దీంతో వీటికి నాలుగు రెట్లు.. అంటే యావరేజ్‌గా ఎకరాకు రూ.30 లక్షల వరకు అందేలా మార్చారు. ఇదే పద్ధతిని భూసేకరణ చేయాలనుకుంటున్న ప్రతి ప్రాంతంలో మార్కెట్ రేట్లను సవరించి చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. 2013 భూసేకరణ చట్టంలోని 107 సెక్షన్ ప్రకారం.. అధికంగా పరిహారం చెల్లించేందుకు లేదా ఈ చట్టంలో పేర్కొన్న పునరావాసం, పునర్నిర్మాణం ప్రయోజనాలకన్నా మెరుగైన ప్రయోజనాలను అందించేందుకు మరిన్ని అంశాలను చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంది.
40 వేల నుంచి 50 వేల ఎకరాలు అవసరం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ డెవలప్మెంట్ పనులకు, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున భూమి సేకరించాల్సి ఉన్నది. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం 40 వేల నుంచి 50 వేల ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇంకో 10 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాలు అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కోసం ఆరు వేల ఎకరాలు అవసరం కానున్నట్లు పేర్కొంటున్నారు. ఇవికాకుండా జిల్లాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం దాదాపు 7 వేల ఎకరాల పైనే భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెట్రో, వివిధ రకాల ఎత్తిపోతల పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర డెవలప్మెంట్పనుల కోసం ఇంకో 10 వేల ఎకరాలు అవసరం. దీంతో ఎక్కడా ఇబ్బంది ఏర్పడకుండా రైతులకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.