వైఎస్సార్ బతికున్నా తెలంగాణ వచ్చేది

  • 2009లోనే రాష్ట్ర విభజన జరగాల్సింది: కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతోనే రాష్ట్ర విభజన జరిగిందనే ప్రచారంలో నిజం లేదని, ఆయన బతికున్నా.. తెలంగాణ వచ్చేదని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ 2009లోనే నిర్ణయం తీసుకున్నదని, అప్పుడే విభజన జరగాల్సిందని తెలిపారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన సంక్రాంతి ‘ఆత్మీయ సమ్మేళనం’ ప్రోగ్రామ్​లో ఆయన మాట్లాడారు. ‘‘2009 ఎన్నికలకు ముందు నేను చీఫ్ విప్​గా ఉన్న. అప్పుడు నన్ను వైఎస్సార్‌‌ పిలిచి.. ‘‘రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుకూలం’’ అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారు. ఎన్నికలకు ముందు ఈ తీర్మానం పెడితే ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పిన.. ‘‘నా చేతుల్లో ఏమీ లేదు. అది పై నుంచి వచ్చిన ఆర్డర్. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. కావాలంటే ఆయనతో మాట్లాడండి’’అని వైఎస్​ నాతో అన్నారు. 

అప్పుడు నేను, మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి, పాలడుగు వెంకట్రావు.. ఇంకొందరు కలిసి ప్రణబ్ ముఖర్జీతో 45 నిమిషాలు మాట్లాడినం. ‘‘మేము తెలంగాణకు అనుకూలం’’అనే తీర్మానాన్ని ‘‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’’అని మార్చి అసెంబ్లీలో పెట్టినం’’అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2009లోనే జరగాల్సిన రాష్ట్ర విభజన.. 2014లో జరిగిందని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే, వైఎస్సార్ జీవించి ఉన్నా కూడా.. విభజన ఆగేది కాదు’’అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.