సింగరేణిపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి

సింగరేణిపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి

గోదావరిఖని, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మనుగడకు ముప్పు తెచ్చే కుట్రలు చేస్తున్నాయని, వాటిని కార్మికులు తిప్పికొట్టాలని ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఐ.కృష్ణ, జె.సీతారామయ్య కోరారు. ఆదివారం గోదావరిఖనిలో గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం విలీన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సహకరిస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు, ఉద్యోగ భద్రత సాధించుకునేందుకు పోరాటాలు నిర్వహించాలని సూచించారు. గతంలో సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కేకే గనుల అమ్మకానికి వ్యతిరేకంగా సమ్మె చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. నరేశ్, బి.అశోక్, రామకృష్ణ, ఎండీ జాఫర్, నాగేశ్వరరావు, కాపు కృష్ణ, మల్లేశం పాల్గొన్నారు.