ధర్పల్లి, వెలుగు: బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతిని అందించాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కొత్త బస్టాండ్‌నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు నాయకులు మాట్లాడుతూ 2014 ఫిబ్ర వరి 28 కటాఫ్ డేట్ నిబంధన తొలగిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించి మూడేళ్లు గడిచినా ఇంత వరకు జీవనభృతి పింఛన్ అమలు కాకపోవడం శోచనీయమన్నారు. బీడీ పరిశ్రమపై 90 శాతం మహిళలు ఆధారపడి ఉన్నారన్నారు. పనిలేక పరిశ్ర మ నడువక పెరుగుతున్న ధరలను తట్టుకోలేక అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజా మోయినొద్దీన్, బాలయ్య, జేబీ గంగాధర్, సుప్రియ, ప్రశాంతి, పద్మ, చిట్టిబాబు పాల్గొన్నారు.
19 నుంచి మున్నూరుకాపు చైతన్య యాత్ర
నిజామాబాద్ రూరల్, వెలుగు: మున్నూరుకాపుల ఐక్యత కోసం ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న చైతన్య యాత్రను సక్సెస్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరుకాపులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం మున్నూరుకాపులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోర్తే రాజేందర్, జాయింట్ సెక్రటరీ చెన్నరెడ్డి, నిజామాబాద్ అర్బన్ కోఆర్డినేటర్ గాండ్ల లింగం, ముత్యల శ్రీనివాస్, కిసాన్‌రెడ్డి, పి.దేవేందర్, అనిల్ పాల్గొన్నారు.
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో రూల్స్‌కు విరుద్ధంగా రాత్రి సమయంలో తరగతులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంధం సంజయ్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎంఈవో చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆయన వారితో కుమ్మక్కైనట్లు ఆరోపించారు. ఇప్పటికైనా రాత్రి తరగతులు, అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ మండల కన్వీనర్సమీర్, ఖాన్, రాజేందర్, అజయ్ పాల్గొన్నారు.
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
నిజామాబాద్, వెలుగు: పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్లను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 15 మంది స్టూడెంట్లు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పైచదువులు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, కర్క గణేశ్, అశుర్, అనిల్, జిల్లా సహాయ కార్యదర్శులు అజయ్, చందు, కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు మహిపాల్, వినోద్, అఖిల, చరణ్, వర్షిణి, సంగీత, నవీన్ పాల్గొన్నారు.
హత్య కేసులో ఒకరి అరెస్టు
కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి టౌన్‌లో ఈనెల 10న జరిగిన శేర్ల సుజాత(55) హత్య కేసులో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లికి చెందిన గంగుల శ్రీనివాస్ అలియాస్ డిజే శ్రీను ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు గొంతు నులిమి చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు అపహరించుకు పోయాడన్నారు. ఆయా కోణాల్లో విచారణ జరిపి మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి 2 తులాల బంగారం గొలుసు, ఒక తులం గుండ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
మరో కేసులో...
ఎల్లారెడ్డి టౌన్‌లో ఈనెల 10న కల్లు దుకాణం వద్ద ముసలి వ్యక్తికి కల్లు తాగించి అతని వద్ద నుంచి వస్తువులు అపహరించుకుపోయిన లింగంపేట మండలం కొండాపూర్‌కు చెందిన నీరుడి సాయిలును అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అతడి నుంచి 7 తులాల వెండి కడియం, 2 వెండి దండ కడియాలు, బంగారం చెవి పోగు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుల దర్యాప్తుల్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్సై గణేశ్ చూరుకుగా వ్యవహారించినట్లు ఎస్పీ తెలిపారు.