సామాజిక అంతరాలు, కులవేదన, అస్పృశ్యతా జాడ్యం, అవమానాలు, అతి శూద్రులను ఊరికి దూరంగా ఉంచడం, శూద్రులకు చదువు నిషేధం లాంటివి కొనసాగుతున్నాయి. కుల, మత, జాతి విద్వేషాలతో సామాజిక, ఆర్థిక అంతరాలతో కొట్టుమిట్టాడుతున్న భారతాన్ని చూస్తూ, వివక్షను అనుభవిస్తూ పెరిగాడు అంబేద్కర్. ప్రపంచ తాత్వికుడైన బోధిసత్వుడి రచనలను జీర్ణం చేసుకున్నాడు.
భారతదేశ కుల, సామాజిక స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ దేశానికి కావాల్సింది ఆర్థిక, భౌగోళిక స్వాతంత్ర్యంతో పాటు సామాజిక అంతరాల తొలగింపు, కులనిర్మూలన అని బలంగా నమ్మాడు. సాహు మహారాజ్ ప్రోత్సాహంతో ప్రపంచంలో ఎవరూ చదువనన్ని చదువులు చదివాడు. భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, కుల, మత, భౌగోళిక స్వభావాన్ని అంబేద్కర్ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేకపోయారు.
వర్ణ, కుల రహిత భారత నిర్మాణానికి కృషి చేశాడు. తన జీవితాన్నంతా అణగారిన జాతుల కోసం, దేశం కోసం ధారబోశాడు.అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించాడు. ఈ దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండటానికి ఏం చేయాలో ఆలోచించాడు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, స్టేట్ సోషలిజం, బౌద్ధ నైతిక ధర్మం, సత్యం, అహింస మానవీయ ఆలోచనా విధానం, సమానత్వం, ఆర్థిక, అంతరాల తొలగింపు అంశాలుగా రాజ్యాంగం రూపొందించాడు. ప్రతివ్యక్తికీ ఆర్థిక, సామాజిక, కుల, మత అంతరాలకు అతీతంగా ఓటుహక్కును, విద్యా హక్కును రాజ్యాంగంలో కల్పించాడు.
దేశమంటే అంబేద్కర్
రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రియాంబుల్‌లో ఒక పేజీ చదివితే చాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విశిష్టత, తానెలాంటి భారతాన్ని కోరుకుంటున్నారో, భారతదేశ సమస్యల పరిష్కారానికి రాజ్యాంగం ఎలా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. విశ్వమంటే బోధిసత్వుడే అయితే, దేశమంటే అంబేద్కర్ అన్నది ప్రపంచం అర్థం చేసుకుంది. అందుకే భారతదేశాన్ని బుద్ధభూమి అన్నాడు ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. ఇది బుద్ధభూమిబుద్ధభూమిని కుల, మత, సామాజిక, ఆర్థిక అంతరాల భూమిగా మార్చినవారికి అంబేద్కర్ నచ్చడు.
అంబేద్కరిజం మనువాద బీజేపీకి రాజ్యాంగం నచ్చదు. రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని ప్రవేశపెట్టాలని సర్వవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలన్న విషయం ముందుకొచ్చింది. మోదీ పాలనలో మొత్తంగా రాజ్యాంగాన్నే మార్చి మనుధర్మ (మనువర్ణ) శాస్త్రాన్ని రాజ్యాంగంగా స్వీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శూద్రులు సేవకులా?
అంబేద్కర్ కల్పించిన సామాజిక వెనుకబాటు రిజర్వేషన్లకు గండికొడుతూ ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం, అదానీ, అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు పెరిగితే దేశ సగటు ఆదాయంలో, పేదరికంలో దేశం 200/164వ స్థానంలో ఉండటం, ఆ పేదలంతా శూద్రులే కావడం ఇందుకు ఉదాహరణలు. ఒరిస్సా ముఖ్యమంత్రి శూద్రులు సేవకులుగా మాత్రమే ఉండాలని బాహాటంగా చెప్పినా.. శూద్ర, దళిత మేధావులు ఆ విషయాన్ని ఖండించలేదు. సాక్షాత్తు దేశ హోంశాఖామంత్రి అమిత్‌షా, అంబేద్కర్‌ను మరిచిపోయి రామదైవ జపం చేయాలని కించపరచడం అత్యంత బాధ్యతారాహిత్యం.
అంబేద్కర్‌కు నెహ్రూ, కాంగ్రెస్ సపోర్టు
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించడం దేశాన్ని అవమానించినట్టే. ఒరిస్సా ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి మాటలను ఖండించి క్షమాపణలు చెప్పమని అడగకుండా ప్రధాని మోదీ డెబ్బై, ఎనభై ఏండ్లకింద నెహ్రూ, గాంధీ, కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానించారని ప్రజల దృష్టి మరల్చుతున్నారు.
రాజ్యాంగనిర్మాణ, స్వాతంత్ర్య పోరాటకాలంలో నెహ్రూ, అంబేద్కర్‌ల మధ్య భిన్నాభిప్రాయాలుండొచ్చు. అది సహజం. కానీ, అశోక ధర్మచక్రాన్ని జాతీయజెండాలో ప్రతిష్టించడం, సెక్యులర్, సోషలిస్టు పదాలను ప్రియాంబుల్‌లో చేర్చడంలో అంబేద్కర్‌కు నెహ్రూ, కాంగ్రెస్ సపోర్టుంది.
రాజ్యాంగాన్ని కాపాడగల పార్టీ కాంగ్రెస్సే
రాజ్యాంగాన్ని ఇంతవరకు భద్రంగా కాపాడిన పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సాంప్రదాయశక్తులు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు బలం పుంజుకుంటున్న కొద్దీ రాజ్యాంగానికి, అంబేద్కర్ భావజాలానికి తూట్లు పొడవడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గుర్తించాడు కాబట్టే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ దేశవ్యాప్త రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ప్రారంభించింది.
ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ రావడం బీజేపీకి నచ్చడం లేదు. శూద్రుల్లోంచి నాయకులుగా ఎదిగిన కృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్య, ఈటల రాజేందర్ లాంటి నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు రాహుల్ చేస్తున్న రాజ్యాంగ పరిరక్షణ పోరాటానికి మద్ధతు పలకకుంటే అదో పెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. దేశమంటే అంబేద్కర్ అనే విషయాన్ని ఆయనకు ఉన్న ప్రపంచవ్యాప్త ఆదరణ,కీర్తిప్రతిష్టలను చూసైనా అమిత్‌షా, మోదీ గుర్తిస్తే మంచిది.
-డా. కాలువమల్లయ్య, విశ్లేషకుడు-