
సిద్దిపేట, వెలుగు: పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలన్న గుడాటిపల్లి నిర్వాసితుల ఆందోళన పట్టించుకోకుండా ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. గత నెలలో గుడాటి పల్లి నుంచి పోలీసుల పహారాలో బలవంతంగా నిర్వాసితులను తరలించిన అధికారులు వారం రోజుల్లో పూర్తి పరిహారాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అయినా రెండు సార్లు ట్రయల్ రన్సక్సెస్ కావడంతో త్వరలో సీఎం కేసీఆర్‌తో ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌నియోజకవర్గం పరిధిలోని గుడాటిపల్లి వద్ద 8.23 టీఎంసీల కెపాసిటీతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
మొదట1.4 టీఎంసీలతో నిర్మించాలని భావించినా రీ డిజైన్ చేసి కెపాసిటీని 8.23 టీఎంసీలకు పెంచారు. ఇందుకోసం 10.5 కిలో మీటర్ల పొడవు, 6 మీటర్లు వెడల్పు , 42 మీటర్ల ఎత్తులో కట్టను నిర్మించారు. మిడ్ మానేరు నుంచి తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హుస్నాబాద్ మండలం రేగొండ పంప్ హౌజ్ కు చేరిన నీళ్లను గౌరవెల్లి ప్రాజెక్టులోకి ఎత్తి పోస్తారు. రేగొండ్ పంప్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మూడు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించి, 0.5 టీఎంసీల నీటిని ప్రాజెక్టులోకి వదిలారు. ట్రయల్రన్సక్సెస్ కావడంతో ప్రారంభోత్సవానికి రెడీ చేస్తున్నారు.
పెండింగ్ లోనే పరిహారాలు
గౌరవెల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గుడాటిపల్లి, మరో రెండు తండాలకు చెందిన నిర్వాసితులు నాలుగేండ్లుగా పరిహారాల కోసం ఆందోళన చేస్తున్నారు. గుడాటిపల్లి నిర్వాసితులు 1,100 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. మే నెలలో బలవంతంగా గుడాటిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించారు. గుడాటిపల్లితో పాటు రెండు తండాలకు చెందిన కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 50 మందికి ఇంటి స్థలాల పరిహారం, 10 మందికి ఇండ్లకు సంబంధించి, 30 మందికి బావులు, బోర్లు, పశువుల కొట్టాలకు సంబంధించిన పరిహారాలు పెండింగ్ లో ఉన్నాయి. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. గుడాటిపల్లి నుంచి మేలో బలవంతంగా తరలించిన 20 కుటుంబాలకు హుస్నాబాద్‌లోని డబుల్బెడ్రూం ఇండ్లలో తాత్కాలికంగా మాత్రమే వసతి కల్పించారు. దీనికి తోడు 45 ఎకరాల భూసేకరణపై కోర్టులో కేసు కొనసాగుతోంది. గుడాటిపల్లి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మరో రూ. 30 కోట్లు అవసరమవుతాయని అధికారులు రిపోర్ట్ చేసినా ప్రభుత్వం స్పందించలేదు.
యువతులకు అందని ప్యాకేజీ
18 ఏండ్లు నిండిన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిఉన్నా పెళ్లయ్యిందన్న కారణంగా యువతులకు సహాయాన్ని నిరాకరించారు. 2010 నుంచి 2015 మధ్యకాలానికి సంబంధించి 18 ఏండ్లు నిండిన 141 మందికి రూ. ఆరు లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఇందులో పెండ్లైన యువతులు కూడా ఉన్నారు. ఆ తర్వాత కటాఫ్ తేదీ పొడగించడంతో మరికొంత మందికి పరిహారాన్ని ఇచ్చారు. ఇందులో 117 మంది పెండ్లయిన యువతులుండగా వారికి మాత్రం మొండిచేయి చూపారు. దీంతో ఆ యువతులు గుడాటిపల్లి వద్ద ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నారు.
ఎన్జీటీ లో నడుస్తున్న కేసు
గౌరవెల్లి ప్రాజెక్టు రీడిజైన్‌కు సంబంధించి పర్యావరణ అనుమతి లేకుండానే పనులు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు నడుస్తోంది. గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, మరో ముగ్గురు పిటీషన్ దాఖలు చేశారు. కట్ట ఎత్తు పెంపు పనులకు పర్యావరణ అనుమతి లేదని, డీపీఆర్ సమర్పించలేదని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్జీటీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ప్రాజెక్టును సందర్శించి ఉల్లంఘనలు నిజమేనని రిపోర్ట్ ఇచ్చింది. ఎన్జీటీ లో ఈనెల6న ఈకేసుపై విచారణ జరగనుంది. నిర్వాసితులకు పూర్తి పరిహారాలు చెల్లించిన తర్వాతే పనులు చేస్తామని ప్రభుత్వ లాయర్ కోర్టుకు చెప్పినా అధికారులు పనులు పూర్తి చేశారు.
ఇల్లు కూల్చి ఎల్లగొట్టిండ్రు
ప్రాజెక్టు కోసం 5.30 ఎకరాల భూమి తీసుకున్నా ఇంతవరకు పూర్తి పరిహారం ఇయ్యలేదు. ఊర్లో ఇల్లు కూలగొట్టి బలవంతంగా ఎల్లగొట్టిండ్రు. నా ఇద్దరు కొడుకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటికి ఇయ్యలేదు.
- మామిడి మల్లారెడ్డి, నిర్వాసితుడు, గుడాటిపల్లె
భూమికి పరిహారం ఇయ్యలె
గౌరవెల్లి ప్రాజెక్టు రీడిజైన్ చేయకముందు 2009లో నా భూమి, ఇల్లు పోయినా ఇంతవరకు ఇంటి పరిహారం ఇవ్వలేదు. నా కొడుకు, బిడ్డకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. గత నెల గుడాటిపల్లిలో నా ఇల్లు కూల్చి ఎల్లగొట్టిండ్రు. భూమి పోయి, చేతిలో డబ్బులు లేక పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేక అవస్థలు పడుతున్న. ప్రాజెక్టు షురు చేసేటప్పుడన్నా పరిహారం ఇయ్యాలే.
- అంగేటి తిరుమల, నిర్వాసితురాలు, గుడాటిపల్లె
నిర్వాసితులకు న్యాయం చేయాలి
గుడాటిపల్లి నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. మిగిలిన వాటిని కూడా పరిష్కరించాలి. ఊరిని ఖాళీ చేయించడంతో నిర్వాసితులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు.
- బద్దం రాజిరెడ్డి, సర్పంచ్‌గుడాటిపల్లి