హైదరాబాద్ లో రోజురోజుకి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని వల వేస్తున్నారు. ఉపాధి కోసం ఎదురుచూసే వారిని ఆసరగా తీసుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు.. మంచి సాలరీ ఇప్పిస్తామని ఆశ చూపించి బతుకులను ఆగం చేస్తున్నారు. ఈ మధ్యన హైదరాబాద్ లో చిన్నా చితకా కంపెనీలు..ముందుగా వారితో డబ్బులు కట్టించుకోవడం తర్వాత బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. ఇలా హైదరాబాద్ లో ఇప్పటికే వందల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయి సైబర్ క్రైం విభాగానికి.
లేటెస్ట్ గా హైదరాబాద్ లోని బేగంపేట అడ్డాగా నడిపిస్తున్న ఓ ఐటీ కంపెనీ ప్రతినిధులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరుతో కంపెనీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సీఈఓ ప్రతీక్ చావే, హెచ్ ఆర్ దాసరి స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు . వారి నుంచి దాదాపు 30 కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ పోర్టల్ లో వీరిపై 50 కి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు.
రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ నడుస్తోంది. హైదరాబాద్ లో బేగంపేట వైట్ హౌస్ భవనంలో దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డిజిటల్ సర్వీసెస్ అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తున్నారు నిర్వాహకులు. రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని చెబుతున్నారు. ఇలా తమను సంప్రదించిన వారిని ఐడి క్రియేట్ చేసుకోవాలని చెప్పి వారి నుంచి 1800 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత కేవైసీ సహా పలు రకాల పేర్లతో వేల రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ క్రైంకు కంప్లైంట్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు.
Also Read:వాట్సాప్ లో AI ప్యూచర్.. ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది..!