ఇయ్యాల ట్రిపుల్​ ఐటీ స్నాతకోత్సవం

భైంసా,వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీ సమస్యలు ఇంకా పూర్తిస్థాయిలో  పరిష్కారం కాలేదు. డిమాండ్ల సాధన కోసం జూన్ లో ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. స్పందించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు వర్సిటీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్​ తమిళిసై సౌందర్య రాజన్​కూడా వర్సిటీని సందర్శించి స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఎస్జీసీ (స్టూడెంట్​గవర్నింగ్​ కౌన్సిల్​) ఆధ్వర్యంలో 12 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేసినా. వీటిలో నాలుగైదు మినహా మిగతావన్నీ యథాతథంగా పెండింగ్​లో ఉన్నాయి. 

మంత్రి కేటీఆర్ పైనే ఆశలు...

బాసరల ట్రిపుల్​లో శనివారం స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి రానున్నారు. దీంతో స్థానిక సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించనుందని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఎక్కడి సమస్యలక్కడే...

విద్యార్థుల డిమాండ్లలో ప్రధానంగా సీఎం కేసీఆర్​ట్రిపుల్​ఐటీకి రావాలని, రెగ్యూలర్  వీసీ, డైరెక్టర్ నియమించాలని కోరుతున్నారు. మెస్​కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ఏజెన్సీలను రద్దు చేయాలంటున్నారు. ఫ్యాకల్టీ స్టూడెంట్స్​ రేషియో, రెగ్యూలర్ ఫ్యాకల్టీ నియామకం, డిజిటల్ లైబ్రరీ, యూనిఫాం, మెస్ సమస్య తీరలేదు. కీలక పోస్టులైన అడ్మినిస్ట్రేటివ్, డీన్ తదితర పోస్టులు ఇన్​చార్జీలతోనే నెట్టుకురావడంతో ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాకల్టీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

మీడియాపై ఆంక్షలు కంటిన్యూ...

ట్రిపుల్ ఐటీలో ఆంక్షలు రోజురోజుకు ఎక్కువుతున్నాయి. విద్యార్థులు, సిబ్బంది వర్సిటీ రూల్స్ మేరకు నడుచుకోవాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. మీడియాతో, స్థానికులతో మాట్లాడితే విచారణ చేపడుతున్నారు. క్యాంపస్​లోకి మీడియాను అనుమతించడం లేదు.