కాషాయ దుస్తుల్లో వచ్చి కర్రలతో చితకబాదారు.. టీవీ డిబేట్‎లో IIT బాబాపై దాడి..!

కాషాయ దుస్తుల్లో వచ్చి కర్రలతో చితకబాదారు.. టీవీ డిబేట్‎లో IIT బాబాపై దాడి..!

లక్నో: మహా కుంభమేళాలో ‘ఐఐటీ బాబా’గా గుర్తింపు పొందిన అభయ్ సింగ్‎పై దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్‎లో పాల్గొన్న తనపై దాడి జరిగిందని ఆరోపించారు ఐఐటీ బాబా. కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు నేరుగా న్యూస్ రూమ్‌లోకి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. అలాగే కర్రలతో కొట్టారని ఐఐటీ బాబా తెలిపాడు. తనపై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెక్టార్ 126లోని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడు. 

చివరకు పోలీసులు సర్ధి చెప్పడంతో ఐఐటీ బాబా నిరసన విరమించాడు. దీనిపై సెక్టార్ 126 పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తనపై దాడి  జరిగిందని.. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఐటీ బాబా స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడని తెలిపారు. అతడితో మాట్లాడి.. దుండగులపై  చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అతడు శాంతించాడని చెప్పారు. అయితే.. ఈ ఘటనపై ఐఐటీ బాబా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 

అసలేవరీ ఐఐటీ బాబా..?

హ‌ర్యానా రాష్ట్రానికి చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివాడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్‎మెంట్‎లో భారీ ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. కొంత కాలం పాటు ఉద్యోగం చేసిన అభయ్ సింగ్.. జాబ్‎పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో లక్షల జీతాన్ని వదులుకుని తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ వైపు వెళ్లాడు. ఫొటోగ్రఫీ చేస్తోన్న సమయంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు అభయ్ సింగ్. దీంతో లక్షల వచ్చే జాబ్, ఇష్టమైన ఫొటోగ్రఫీని వదిలేసి.. సన్యాసం స్వీకరించి బాబాగా మారాడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‎‎లోని ప్రయాగ్ రాజ్‎లో ఇటీవల జరిగిన మహా కుంభమేళాకు వెళ్లాడు అభయ్ సింగ్. 

పూర్తిగా కాషాయ దుస్తుల్లో ఉండి ఫ్లూయెంట్‎గా పలు భాషాలు మాట్లాడుతున్న అభయ్ సింగ్.. ఓ మీడియా ఛానెల్ కంటపడ్డాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్‎లో చదవి.. సన్యాసం వైపు అడుగులేయడానికి కారణమేంటని న్యూస్ ఛానెల్ ఐఐటీ బాబా స్టోరీని తెలుసుకుంది. ఈ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అభయసింగ్ అలియాస్ ఐఐటీ బాబా లైమ్ లైట్‏లోకి వచ్చారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు ఐఐటీ బాబా. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్, ఇండియా తలపడే మ్యాచులో టీమిండియా ఓటమి పాలువుతుందని మ్యాచ్‎కు ముందు ఐఐటీ బాబా జోస్యం చెప్పాడు.

కానీ ఐఐటీ బాబా జ్యోతిష్యం బూమరాంగ్ అయ్యింది. దాయాది పాకిస్థాన్‎ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ ఓటమి పాలవుతుందని కామెంట్స్ చేసిన నేపథ్యంలోనే ఐఐటీ బాబాపై దాడి  జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై అతడు ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. భారత్ గెలవదని చెప్పాను కానీ టీమిండియానే గెలుస్తుందని నా మనసుకు తెలుసంటూప్లేట్ ఫిరాయించాడు ఐఐటీ బాబా.