ఈ ట్రంక్ పెట్టెలో వస్తువులు పెడితే.. వైరస్ ఖతం

ఈ ట్రంక్ పెట్టెలో వస్తువులు పెడితే.. వైరస్ ఖతం
  • డివైజ్​ను రూపొందించిన ఐఐటీ రోపార్
  • త్వరలో రూ. 500 కే అందుబాటులోకి

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ ఎఫెక్టుతో నిత్యావసర సరుకులు బయటినుంచి ఇంట్లోకి తేవాలంటేనే జనాలు భయపడుతున్నారు. అయితే.. ఇకమీదట ఆ భయం అక్కర్లేదని, వైరస్ నుంచి వస్తువులను క్లీన్ చేసే పరికరాన్ని తయారు చేశామని చెప్తున్నారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రోపార్ ప్రతినిధులు. కూరగాయలు, పాలప్యాకెట్లు, కిరాణా సామాను, కరెన్సీ నోట్లు వంటి వస్తువులను క్లీన్ చేసేందుకు ట్రంక్ పెట్టె లాంటి పరికరం రూపొందించామని, అందులో 30 నిమిషాల పాటు ఉంచిన వస్తువులపై ఎలాంటి వైరస్ ఉన్నా.. చచ్చిపోతుందని అంటున్నారు. అయితే 30 నిమిషాల తర్వాత చల్లబడే వరకు ఓ 10 నిమిషాల ఆగి బేఫీకర్ గా ఆ వస్తువులను వాడుకోవచ్చని సూచిస్తున్నారు.

ఫోన్లు, రిస్ట్ వాచీలు, వాలెట్​లనూ క్లీన్ చేస్తది

వాటర్ ప్యూరిఫైర్​లలో ఉపయోగించే అల్ట్రావయలెట్ జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో ట్రంక్ పెట్టె ఆకారంలో పరికరాన్ని డెవలప్ చేశామని ఐఐటీ ప్రతినిధులు తెలిపారు. బయటికి వెళ్లొచ్చిన తర్వాత కూరగాయలు, సరుకులతో పాటు రిస్ట్ వాచ్, వాలెట్, మొబైల్ ఫోన్లు, న్యూస్ పేపర్ వంటి ఎలాంటి వస్తువులనైనా ఈ పెట్టెలో అరగంట పాటు ఉంచిన తర్వాత ఉపయోగించాలని సూచించారు. అయితే.. ట్రంక్ లోపల ఉంటే లైటింగ్ హానికరం కాబట్టి ఎవరూ నేరుగా చూడకూడదని హెచ్చరించారు. కొద్ది రోజుల్లోనే కమర్షియల్ వెర్షన్ లోకి తెచ్చిన తర్వాత ట్రంక్ రూ.500 కన్నా తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

మరిన్ని జాగ్రత్తలు కంపల్సరీ


‘‘కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వస్తువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటివరకు చాలామంది పాల ప్యాకెట్లు, కూరగాయలను కడిగిన తర్వాత ఉపయోగిస్తున్నారు. కానీ, డబ్బులు, పేపర్లు, పర్సులు, ఫోన్లను కడగలేరు కాబట్టి.. వాటిని క్లీన్ చేసే పరికరం తయారు చేశాం. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి కుటుంబం ట్రంక్​ను ఇంటి గుమ్మం దగ్గరే పెట్టుకోవాలి” అని రోపార్ సైంటిస్ట్ నరేశ్​ రాఖా మీడియాతో చెప్పారు.