రాష్ట్రంలో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది.. ఇటీవల విద్యార్థి కార్తీక్ సూసైడ్ ఘటన మరువక ముందే ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్యాంపస్ రూంలో విద్యార్థిని ఫ్యాన్ కు ఉరేసుకుంది. సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు ఒడిశాకు చెందిన మమైతా నాయక్ గా గుర్తించారు పోలీసులు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సోమవారం రాత్రి హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. గదిలోని సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో ఉంది. విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.