- కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
- ఐఐటీ హైదరాబాద్‌లో పర్యటించిన గవర్నర్
సంగారెడ్డి, వెలుగు : భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ కీలకపాత్ర వహించాలని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు కలెక్టర్ క్రాంతి వల్లూరు స్వాగతం పలికారు. అనంతరం ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన మీటింగ్‌లో గవర్నర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా దేశాభివృద్ధికి ఐఐటీ స్టూడెంట్స్ తోడ్పడాలన్నారు.
విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలోని అన్ని ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభినందించారు. అంతకుముందు ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ పరిశోధనల గురించి డైరెక్టర్ బీఎస్‌ఎన్.మూర్తి కేరళ గవర్నర్‌కు వివరించారు.
ఐఐటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో అత్యాధునిక పరిశోధనలు, స్టార్టప్ సహకారాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఐఐటీ హైదరాబాద్ చేస్తున్న పరిశోధనల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్య, కంది తహసీల్దార్ విజయలక్ష్మి, డీటీ మల్లయ్య, ఐఐటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.