ఇండోర్ : బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే పరికరాన్ని ఐఐటీ ఇండోర్ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా రూరల్, రిమోట్ ఏరియాల్లో నివసించే మహిళల కోసం అందుబాటు ధరల్లో ఇది ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫీషియల్స్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ డివైజ్‌ను ఐఐటీ ఇండోర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ శ్రీవత్సన్ వాసుదేవన్ అభివృద్ధి చేశారని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా మహిళా రోగుల ప్రాణాలను రక్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ డివైజ్ ఫొటోకాస్టిక్ స్పెక్ట్రల్ రెస్పాన్స్ (పీఏఎస్‌ఆర్) సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందని తెలిపారు. ఇది ఆప్టికల్, అకౌస్టిక్ సిగ్నల్‌లను కలిపి కణజాలాల్లో అసాధారణ మార్పులను గుర్తిస్తుందని చెప్పారు. ఈ పరికరం ధర.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను నిర్ధారించే ట్రెడిషినల్ డయాగ్నోస్టిక్స్ ధర కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఐఐటీ ఇండోర్ డైరెక్టర్ సుహాస్ జోషి మాట్లాడుతూ.. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి ఎంఆర్‌ఐ, సీటీ స్కానర్స్ ఉన్నాయని, వీటి కాస్ట్ ఎక్కువగా ఉందన్నారు. అయితే, దేశంలో ఉన్న జనాభాకు ఇవి తక్కువ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ వాసుదేవన్ మాట్లాడుతూ.. ఈ పరికరానికి క్యాన్సర్, క్యాన్సర్ కాని కణజాలాల మధ్య గుర్తించే సామర్థ్యం ఉందన్నారు. ఇందులో కాంతిని ఉత్పత్తి చేయడానికి కాంపాక్ట్ పల్సడ్ లేజర్ డయోడ్ (పీఎల్‌డీ) ఉపయోగించామని, ఇది టిష్యూతో ఇంటరాక్ట్ అవుతుందన్నారు. దీంతో కణజాలాలు సాధారణంగా ఉన్నాయా.. నిరుపయోగంగా ఉన్నాయా.. ప్రాణంతకరంగా ఉన్నాయా అని గుర్తిస్తుందని వెల్లడించారు.