జైల్లో చదివిండు ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు

చుట్టూ జైలు గోడలు... ఇరుకు గదులు... పక్కనేమో రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు... హంతకుడనే ముద్ర...  ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు పట్టి చదువు కున్నాడు.  పట్టుదలతో చదివి ఈ ఏడాది ఐఐటి జామ్‌‌ ఎగ్జామ్​లో అల్‌‌ఇండియా 54వ ర్యాంక్‌‌ సాధించాడు.  ఒక హత్య కేసులో ఏడాదిగా అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంటున్న  సూరజ్‌‌ కుమార్‌‌‌‌ అలియాస్‌‌ కౌశలేంద్ర. ‘మన గతం ఎలాంటిదైనా, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లాలి’ అంటున్న సూరజ్‌‌ కథ ఇది. 

‘కష్టే ఫలి’.... అంటే కష్ట పడ్డవాళ్లకు ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం ఉంటుంది.    అనుకున్నది సాధించాలనే తపన ఉంటే, ఎలాంటి సిచ్యుయేషన్​లోఉన్నా సరే కలల్ని నిజం చేసుకోవచ్చు అని నిరూపించాడు 23 ఏండ్ల సూరజ్‌‌. అనుకోకుండా చేసిన తప్పుకు  శిక్ష అనుభవిస్తున్న ఇతను... జైల్లో ఉంటూనే తన చదువు కంటిన్యూ చేశాడు. 

అసలేం జరిగిందంటే...

సూరజ్​ సొంతూరు బీహార్‌‌‌‌లోని మోస్మా. చిన్నప్పటి నుంచే పెద్ద చదువు చదివి, మంచి జాబ్ చేయాలి. జీవితంలో  సెటిల్​ అవ్వాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టే బాగా చదివేవాడు కూడా. కానీ, ఊర్లో, ఒకరితో జరిగిన భూమి గొడవ  సూరజ్​ జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ గొడవలో అనుకోకుండా అతను ఒకరిని కొట్టాడు. గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. దాంతో, సూరజ్‌‌తో పాటు 11మందిని అరెస్ట్  చేశారు పోలీస్‌‌లు.  సూరజ్​తో కలిపి నలుగురి మీద హత్యకేసు పెట్టి నవాడా జైలుకి పంపారు. ‘ఇక చేసేదేం లేదు. ఆవేశంలో చేసిన తప్పుకు  జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సైంటిస్ట్‌‌ అవ్వాలనుకున్న నా కల, కలగానే మిగిలిపోయింది’ అని లోలోపలే కుమిలిపోయాడు సూరజ్. 

పట్టుదలతో చదివి..

 జైలు శిక్ష అనుభవిస్తూనే చదువుకోవాలి  అనుకున్నాడు సూరజ్​. చదువు పట్ల సూరజ్‌‌కున్న ఇష్టం తెలుసుకున్న జైలు సూపరింటెండెంట్‌‌ ఉమేశ్‌‌ కుమార్‌‌‌‌ భారతి అతనికి కావల్సిన బుక్స్, మెటీరియల్స్ ఇచ్చాడు. సూరజ్​కు ఏ సబ్జెక్ట్​లోనైన డౌట్స్‌‌ వస్తే, జైల్లోని ఇతర ఆఫీసర్లు తీర్చేవాళ్లు. రూల్స్​ ప్రకారం నవాడా జైల్లో 600 మంది ఖైదీలనే ఉంచాలి. కానీ, అక్కడ దాదాపు 1,100 మంది ఖైదీలు ఉండేవాళ్లు. ఇరుకుగా ఉండే జైలు గదులు.. చుట్టూ చాలామంది మనుషులు... డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి ఎక్కడా చోటు దొరికేది కాదు. అయినా కూడా పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు సూరజ్‌‌. అతడి పట్టుదల చూసిన జైల్‌‌ స్టాఫ్‌‌ ప్రశాంతంగా ఉండే ప్లేస్​లో చదువుకునేందుకు అనుమతించేవాళ్లు. ఐఐటి జామ్‌‌ ఎగ్జామ్‌‌లో 50.33 మార్కులతో ఆలిండియా 54వ ర్యాంక్‌‌ సాధించాడు సూరజ్​. ఐఐటి రూర్కీలో సీట్‌‌ రావడంతో తన జీవితం మళ్లీ మొదలైనట్టు అని పించింది అతనికి. ‘ఇక్కడితో ఆగకుండా  పై చదు వులు చదవాలన్నది నా కల’ అని చెప్పాడు సూరజ్‌‌.