పక్షవాతం వచ్చిన వారికోసం రోబో చెయ్యి

పక్షవాతం వచ్చిన వారికోసం రోబో చెయ్యి

చంద్రయాన్​ 2లో రోవర్​ ప్రజ్ఞాన్​ ఎంతో కీలకం. అదే చంద్రుడి మీద దిగి అక్కడి నేలను అంచనా వేస్తుంది. అందులోని రెండు సబ్​ సిస్టమ్​లను ఐఐటీ కాన్పూర్​కు చెందిన ఆశిష్​ దత్తా, కేఎస్​ వెంకటేశ్​ అనే ఇద్దరు ప్రొఫెసర్లు తయారు చేశారు. జులై 22న ప్రయోగం సక్సెస్​ అయ్యాక వాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాళ్ల ఆనందం రెండింతలైంది. కారణం, పక్షవాతం వచ్చిన వాళ్ల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో చెయ్యిని తయారు చేశారు. ట్రయల్స్​లో విజయం సాధించారు. ఆ కథేంటో ఓసారి చూసేద్దాం.

ప్రజ్ఞాన్​ ముందుకు వెళ్లేలా కాంతి ఆధారంగా మ్యాప్​లను తయారు చేసే వ్యవస్థ, మోషన్​ ప్లానింగ్​లను ఆ ఇద్దరు సృష్టించారు. అదే చంద్రయాన్​ 2 మిషన్​లో కీలకం. ఇప్పుడు రోబోటిక్​ హ్యాండ్​తో ఆనందాన్ని రెండింతలు చేసుకున్నారు. ‘‘ఇది మాకు చాలా గర్వకారణం. ఒక చోటు నుంచి మరొక చోటుకు రోవర్​ పక్కాగా వెళ్లేలా ఆల్గారిథంను అభివృద్ధి చేశాం. అందులో ఓ లైట్​ను పెట్టాం. అది వెలుతురును తీసుకుంటూ లేజర్​లా చంద్రుడి నేలను స్కాన్​ చేస్తుంది. ఫొటోలను తీసి త్రీడీ మ్యాపులను సృష్టిస్తుంది. రోవర్​ను ముందుకు నడుపుతుంది. తక్కువ శక్తి (20 నుంచి 50 వాట్లు) తీసుకునే 10 మెగా హెర్ట్జ్​ ప్రాసెసర్​, సురక్షిత దారి, ఎత్తొంపుల్లో రోవర్​ దొర్లకుండా ఉండడం, అడ్డంకులను దాటడం వంటి నాలుగు కీలక అంశాలతోనే దానికి రూపునిచ్చాం” అని ఆశిష్​ దత్తా చెప్పారు. ఇప్పుడు ఈ రోబో చెయ్యిపై ఇండియా, బ్రిటన్​లలో పెద్ద సంఖ్యలో ట్రయల్స్​ చేస్తున్నాం అని తెలిపారు.

ఇదీ ఆ చెయ్యి పని

ఈ రోబో చెయ్యిని బ్రిటన్​లోని ఉల్​స్టర్​ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్​ గిరిజేశ్​ ప్రసాద్​ సహకారంతో ఆశిష్​, వెంకటేశ్​ దీనిని తయారు చేశారు. రెండు వేళ్లుండే ఈ చెయ్యిని పక్షవాతం వచ్చినవాళ్లు నేరుగా చేతికి దానిని వేసుకోవచ్చు. తలపై పెట్టుకునే బ్రెయిన్​ కంప్యూటర్​ ఇంటర్​ఫేస్​ (బీసీఐ– మెదడును కంప్యూటర్​కు కలపడం)తో ఈ చెయ్యిని కలుపుతారు. బీసీఐ పంపించే సిగ్నళ్లతో ఆ చెయ్యి పనిచేస్తుంది. బ్రెయిన్​ సిగ్నళ్లను అందుకునేలా బీసీఐలో ఈఈజీ (ఎలక్ట్రో ఎన్​సెఫలోగ్రామ్​) ఎలక్ట్రోడ్​ను పెట్టారు. వేళ్లను కదిలించేలా చేస్తుంది. బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు పనితీరును మెరుగుపరుస్తుంది. రోగి వేలి ఒత్తిడిని తెలుసుకునేలా సెన్సర్లనూ దానికి పెట్టారు. బ్యాటరీతో నడిచే ఎట్​మెగా 300 మెగాహెర్ట్జ్​ మైక్రో కంట్రోలర్​ సాయంతో పనిచేస్తుంది. బ్రిటన్​లో ఆరు వారాల పాటు ఎడమచెయ్యి పనిచేయని 16 మందిపై దీనిని పరీక్షించారు. ఆ తర్వాత కాన్పూర్​కు చెందిన ఓ పేషెంట్ కూ ఈ చెయ్యిని పెట్టి పరిశీలించారు. దీని ధర కేవలం 15 వేలని  ప్రొఫెసర్లు తెలిపారు.