సాగర్​ రిపేర్ల పై ఐఐటీ రూర్కీతో స్టడీ..స్పిల్​వేపై పడిన గుంతల మీద అధ్యయనం : మంత్రి ఉత్తమ్​

సాగర్​ రిపేర్ల పై ఐఐటీ రూర్కీతో స్టడీ..స్పిల్​వేపై పడిన గుంతల మీద అధ్యయనం : మంత్రి ఉత్తమ్​
  • ప్రాజెక్టుతో పాటు కాల్వల మరమ్మతులపైనా దృష్టి పెట్టండి
  • రాష్ట్రంలో పనిచేయని 334 లిఫ్టులనూ బాగు చేయాలి
  • నెల్లికల్​ లిఫ్ట్​ను రెండు దశల్లో పూర్తి చేయండి
  • ఫేజ్​1లో వచ్చే ఖరీఫ్​ నాటికి 7,600 ఎకరాలకు నీళ్లివ్వాలని అధికారులకు ఆదేశం
  • జానారెడ్డి, ఎంపీ రఘువీర్​ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్​ రెడ్డితో కలిసి ఉత్తమ్​రివ్యూ

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​డ్యామ్​ స్పిల్​వేపై పడిన గుంతలపై ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయించాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ రూర్కీ టీమ్​ ఇచ్చే రిపోర్ట్​ఆధారంగా స్పిల్​వేకి మరమ్మతులు చేయించాలని సూచించారు. రాష్ట్రంలోని వ్యవసాయ అవసరాలను తీర్చేందుకు సాగర్​ ప్రాజెక్టును దాని సామర్థ్యం మేరకు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళవారం ఆయన ఇరిగేషన్​ శాఖ అధికారులతో సాగర్​ ప్రాజెక్టుతో పాటు నాగార్జునసాగర్​ నియోజకవర్గంలోని వివిధ లిఫ్ట్​ స్కీములపై సమీక్ష చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి జానా రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్​ రెడ్డి, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే జైవీర్​ రెడ్డి, ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్​ ప్రాజెక్టు, కాల్వలకు మరమ్మతులను ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. నల్గొండ జిల్లాలోని వివిధ ఇరిగేషన్​ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాల్సిందిగా కలెక్టర్​కు ఆదేశాలిచ్చారు. ప్రాజెక్టులను టైమ్​కు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనుల పురోగతికి భూసేకరణ అడ్డంకిగా మారకూడదని సూచించారు. 

అన్ని లిఫ్టులనూ బాగు చేయండి

రాష్ట్రంలో 334 లిఫ్ట్​ స్కీములు పూర్తిగా లేదా పాక్షికంగా పనిచేయడం లేదని, వాటి కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉందని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. వాటిని బాగు చేసి పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్న లిఫ్టు స్కీములపై దృష్టి సారించాలని, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పెద్ద లిఫ్ట్​లకు ఖర్చు ఎక్కువ అవుతుందని, తక్కువ ఖర్చుతో చేపట్టే చిన్న లిఫ్టులతో ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు.

నల్గొండ జిల్లాలోని 39 లిఫ్టులను రిపేర్​ చేయాలని, అందుకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లికల్​ లిఫ్టు పనులను వేగవంతం చేయాలన్నారు. రెండు దశలుగా పనులు చేపట్టాలన్నారు. 24,624 ఎకరాలకు నీళ్లందించే ఈ ప్రాజెక్టును రూ.664.8 కోట్లతో ప్రభుత్వం చేపడుతున్నదని, ఫేజ్ 1లో భాగంగా వచ్చే ఖరీఫ్​ సీజన్​లో 7,600 ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. 

లింక్​ కెనాల్​ను పూర్తి చేయండి

సాగర్​ హైలెవెల్, లోలెవెల్​ కెనాల్​ను కలిపే లింక్​ కెనాల్​పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్​ఆదేశించారు. మేదవరం, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను కలుపుతూ సాగే ఈ కెనాల్​పనులకు రూ.62.26 కోట్లు ఖర్చవుతాయని, అందుకు అవసరమైన 65.02 ఎకరాల భూమిలో ఇప్పటికే 43.31 ఎకరాలను సేకరించామని తెలిపారు. దానికి వెంటనే టెండర్లను పిలవాలన్నారు. ఏఎంఆర్​పీలో లెవెల్​కెనాల్​డిస్ట్రిబ్యూటరీలను కాంక్రీట్​ లైనింగ్​తో పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు.

డీ1 నుంచి డీ27 డిస్ట్రిబ్యూటరీల వరకు 6 సెంటీమీటర్ల మందంతో కాంక్రీట్​ లైనింగ్​ వేయాలని, 90.43 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనులకు రూ.42.26 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్​ లో లెవెల్​ మెయిన్​ కెనాల్​(వరద కాల్వ)ను 63 కిలోమీటర్ల వరకు సీసీ లైనింగ్​తో పటిష్టపరచాలన్నారు. అందుకు రూ.125 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ వరద కాల్వ కింద సాగర్, మిర్యాలగూడ, నల్గొండ నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. కాగా, అనుములవారిగూడెంలో శశిలేరువాగుపై చెక్​డ్యామ్​ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.