పెట్రోల్ వెహికిల్స్ కు దీటుగా ఎలక్రికల్ స్కూటర్లు

పెట్రోల్ వెహికిల్స్ కు దీటుగా ఎలక్రికల్ స్కూటర్లు

సంగారెడ్డి, వెలుగుఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాద్ కొత్తకొత్తవి కనుకోవడం, పరిశోధనల్లో తన ప్రత్యేకతను చాటుతోంది. ప్యూర్‌‌‌‌ ఎనర్జీ అనే స్టార్టప్‌‌‌‌ సంస్థతో కలిసి గాలి, శబ్ద కాలుష్య రహిత వెహికిల్స్‌‌‌‌ తయారు చేస్తోంది.  మొదటి దశలో ఎలక్ట్రిక్‌‌‌‌ స్కూటర్లు, ఎలక్ట్రిక్‌‌‌‌ సైకిళ్లు తయారు చేశారు. మరో వారం రోజుల్లో వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. పదివేల ఎలాక్ట్రికల్‌‌‌‌ వెహికిల్స్‌‌‌‌ అందుబాటులో తెస్తామన్నారు. ఈ ఏడాది ఎలక్ట్రికల్‌‌‌‌ బస్సులు, ట్రక్కులు కూడా తయారు చేస్తామని ప్రకటించారు.

2016లో ఐఐటీహెచ్ ప్రొఫెసర్ నిశాంత్ డోంగరి ప్యూర్ ఎనర్జీ అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాటు శక్తివంతమైన లిథియం బ్యాటరీలు, శబ్ద, గాలి కాలుష్య రహిత వాహనాల తయారీపై పరిశోధనలు చేస్తూ వచ్చారు. పెరుగుతున్న ఆటోమొబైల్‌‌‌‌ కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక పరిశోధనలు చేసి సక్సెస్‌‌‌‌ అయ్యారు. దీంతో ప్యూర్‌‌‌‌ ఎనర్జీ సంస్థ సీఈవో రోహిత్ వాదేరా, మార్కెటింగ్ హెడ్ కిరణ్‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికిల్స్‌‌‌‌ తయారీ, మార్కెటింగ్‌‌‌‌ చేయాలని నిర్ణయించారు. తాజాగా ప్యూర్ ఎలక్ర్టిక్ బస్సులు, ట్రక్కులను  రూపొందించే పనిలో ఉన్నారు.

ద్విచక్రంలో నాలుగు మోడల్స్..

లిథియమ్ బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మొదట తయారు చేసిన ఈ ప్లూటో, ఎట్రాన్‌‌‌‌, ఈట్రాన్స్‌‌‌‌,ఎగ్నిటీ మోడళ్లు మార్కెట్​లోకి విడుదల చేయబోతున్నారు. మన దేశ పరిస్థితులు, ప్రజల అవసరాలకు తగ్గట్లు ఎలక్ట్రిక్‌‌‌‌ స్కూటర్లు, సైకిళ్లు తయారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌‌కు నాలుగు గంటలు చార్జింగ్ పెడితే ఒక యూనిట్ కరెంట్‌‌‌‌ తీసుకుంటుంది. దీంతో 120 కిలోమీటర్ల  దూరం ప్రయాణించవచ్చు. అంటే కిలోమీటర్ ప్రయాణానికి కేవలం ఐదు పైసలు ఖర్చు అవుతుంది. వీటి స్పీడ్‌‌‌‌ కూడా పెట్రోల్‌‌‌‌ స్కూటర్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెప్పారు. వేగంగా వెళ్లడానికి అవసరమైన స్థాయిలో ఎనర్జీ రిలీజ్ చేసేలా లిథియం బ్యాటరీలు డెవలప్‌‌‌‌ చేశామన్నారు.

త్వరలో బస్సులు, ట్రక్కులు

శబ్ద, గాలి కాలుష్యం లేకుండా బ్యాటరీల సాయంతో నడిచే ఎలక్ర్టిక్ బస్సులు, ట్రక్కులను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇందుకు అవసరమైన పరిశోధనలపై బుధవారం ఐఐటీ హైదరాబాద్‌‌‌‌లో ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ మధ్య చర్చలు జరిగాయి. 2020 నాటికి ఈ వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. నెలకు రెండు వేల యూనిట్ల ఖర్చుతో హైస్పీడ్‌‌‌‌తో నడిచే బస్సులు, ట్రక్కుల తయారీకి కృషి చేస్తున్నామన్నారు. అలాగే వీటి నిర్వహణ కూడా ఈజీగా ఉండేలా పరిశోధనలు చేస్తున్నామన్నారు.