క్రిటికల్ మినరల్స్ మైనింగ్​లో సింగరేణికి ఐఐటీహెచ్ సహకారం

క్రిటికల్  మినరల్స్  మైనింగ్​లో సింగరేణికి ఐఐటీహెచ్ సహకారం
  • సింగరేణి సీఎండీ బలరామ్​తో ఐఐటీ హెచ్ డైరెక్టర్ భేటీ
  • టెక్నాలజీని అందించేందుకు సిద్ధమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ ఐఐటీ పూర్తి సహకారం అందిస్తుందని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి  పేర్కొన్నారు. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ తో క్రిటికల్ మినరల్స్ రంగంపై కీలక ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో దానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి నేతృత్వంలో ప్రొఫెసర్ల బృందం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ నేతృత్వంలో డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ క్రిటికల్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్​ రంగంలో సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు మేధో విజ్ఞానాన్ని, సాంకేతిక సహకారాన్ని ఐఐటీ అందిస్తుందని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఈ రంగంలో ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నారని, ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీలైన మోనాష్, సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలతో ప్రత్యేక ఒప్పందం ఉందని చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో  టెక్నికల్, మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా సింగరేణి ఉద్యోగులకు ఐఐటీ ద్వారా ప్రత్యేక శిక్షణ కల్పిస్తామన్నారు. 

సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ త్వరలోనే క్రిటికల్ మినరల్స్ పై సింగరేణి అధికారులకు అవగాహన కల్పించేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న ఫ్లైయాష్ లోనూ అరుదైన ఖనిజాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని, వీటిని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైనా పరిశీలించాలని ఐఐటీ హైదరాబాద్ బృందాన్ని కోరారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు ,జి.వెంకటేశ్వరరెడ్డి, సింగరేణి భవన్ నుంచి జీఎం (కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుబానీ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి భవన్ గ్యాలరీలో రాజ్యాంగ ప్రతి

76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాజ్యాంగం పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సింగరేణి భవన్ లోని సందర్శకుల గ్యాలరీలో రాజ్యాంగ ప్రతిని పొందుపరిచారు. శనివారం సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగ ప్రతిని సింగరేణి భవన్ లోని 
సందర్శకుల గ్యాలరీలో పొందుపరిచినట్లు వివరించారు.