
మ్యూజిక్ మేస్ట్రో, ఇసైజ్ఞాని వంటి బిరుదులతో కీర్తించబడుతున్న సంగీత విద్వాంసుడు 'ఇళయరాజా' (Ilaiyaraaja). ఈయన తన 82 ఏళ్ళ వయస్సులో కూడా తనదైన సంగీతంతో, పాటలతో, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
అయితే, ఇన్నాళ్లుగా ఇళయరాజా ఎన్నో విజయాలు అందుకుంటున్న కూడా, తనలోని సాధారణమైన వేషధారణ మాత్రం నిలువెత్తు చంద్రుడిలా ఉంటుంది. తెల్ల పంచా, కుర్తా డ్రెస్సులోనే తనని చూస్తే గుర్తుపడతారు అనే అంతలా ఉంటాడు. కానీ, లేటెస్ట్గా ఈ మ్యూజిక్ దిగ్గజం సూట్లో మెరిసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న ఈ లేటెస్ట్ సూట్ ఫొటోస్, సంగీత అభిమానులకి కనువిందు చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ALSO READ | నిజానికి ఉన్న పవర్ అది .. రాజ్యాంగం, లాయర్లపై మరింత గౌరవం పెరిగింది : ప్రియదర్శి
ఆదివారం (మార్చి 9న) లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్‌లో పేరుగాంచిన లండన్ రాయల్ 'ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో' కలిసి 'వెస్ట్రన్ క్లాసిక్ సింఫోని మ్యూజిక్ షో'ను ఇళయరాజా నిర్వహించారు. ఈ సింఫోని షోకి అభిమానుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. అంతేకాకుండా, ఆసియా చలన చిత్ర సంగీత దర్శకుల్లో ఇక్కడ సింఫోని ఈవెంట్ నిర్వహించిన తొలి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజానే కావడం విశేషం.
సోమవారం (మార్చి 10న) స్వదేశానికి విచ్చేసిన ఇళయరాజాకు చెన్నై విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రభుత్వ గౌరవాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ..' సంగీతానికి వయస్సుతో సంబంధం లేదని, 82 ఏళ్ల వయస్సులో తాను ఏం చేస్తానని అనుకోవద్దు అని, తన అసలైన ఆట ఇప్పుడే మొదలైందని" చెప్పుకొచ్చాడు.
అలాగే త్వరలోనే దుబాయ్, పారిస్‌లో కూడా ఈ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని ఇళయరాజా తెలిపాడు. మొత్తం 13 దేశాల్లో ఈ సింఫోని కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒప్పందాలు జరిగాయని ఈ సందర్బంగా ఇళయరాజా వెల్లడించాడు.