- అడ్డుకుంటే రూలింగ్ పార్టీ నేతలమంటూ బెదిరింపులు
- కంప్లైంట్చేసినా పట్టించుకోని అధికారులు
- దుమ్ము, ధూళితో గ్రామస్తుల అవస్థలు
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని మానేరు, హుస్సేన్మియా వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా, అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వందలాది ఇటుక బట్టీలు ఉండటంతో అధికార పార్టీ లీడర్లు కొందరు మట్టి దందాను ఎంచుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. గతేడాది కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామస్తుడు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకుంటే, గ్రామస్తులంతా చూస్తుండగానే ఆయనపై ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేశారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ లో మట్టి తరలిస్తున్న లారీలను ఆ గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ ఆపాడు. దీంతో ఆగ్రహించిన రవి అనే వ్యక్తి.. తాను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ నని, లారీలను ఎందుకు ఆపుతున్నావని ఫోన్లో బెదిరించాడు. అక్కడికి వస్తే లారీ కిందేసి తొక్కిస్తా అంటూ దుర్భాషలాడాడు. దీంతో సదరు ఎంపీటీసీ పోలీసులకు ఆశ్రయించాడు.
రూలింగ్ పార్టీ అండదండలతోనే?
రూలింగ్ పార్టీ అండతోనే ఇసుక, మట్టి రవాణా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మట్టి తరలించాలంటే నిబంధనలకు అనుగుణంగా పగటి పూటే తరలించాలి. టిప్పర్లను వాడొద్దు. కానీ కాంట్రాక్టర్లు ఇవేవీ పట్టించుకోవడం లేదు. రాత్రి, పగలు తేడాలేకుండా టిప్పర్లలో ర్యాష్డ్రైవింగ్చేస్తూ తరలిస్తున్నారు. మట్టి తరలింపు అనేది ఏడాదిలో ఒకేసారి జరిగేది. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీత తర్వాత మట్టిని ఇటుక బట్టీల యజమానులు రాయల్టీ చెల్లించి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇది దందాగా మారిపోయి ఏడాది పొడవునా నడుస్తోంది.
లారీలు ఆపితే కేసులు పెడుతున్నరు
ఇసుక లారీలతో రోడ్లు ధ్వంసం అయితున్నయి. దుమ్ముతో ఆరోగ్యాలు ఖరాబైతున్నయి. ఎవరికి చెప్పినా పట్టించుకుంట లేరు. లారీలను ఆపితే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నరు. అధికారులు తీసుకోవాలి.
- అనిల్, కిష్టంపేట, కాల్వ శ్రీరాంపూర్