కడుపులోనే చంపుతున్నరు.. 

  • కరీంనగర్‌‌‌‌ జిల్లాలో ఆగని అబార్షన్లు 
  • లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్న ఆదేశాలు బేఖాతర్​
  • తాజాగా సిటీలోని ఓ హాస్పిటల్‌‌లో అబార్షన్ వ్యవహారం వెలుగులోకి
  • బాధ్యులైన డాక్టర్లను రక్షించేందుకు వైద్యాధికారుల యత్నం 

కరీంనగర్, వెలుగు: పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి గర్భంలోనే పిండాన్ని చిదిమేస్తున్నారు. ఇలాంటి అనైతిక పనులకు కొందరు డాక్టర్లు డబ్బులకు కక్కుర్తిపడి సహకరించడం, ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా కరీంనగర్ సిటీలో ఇలాంటి అబార్షన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గతేడాది జమ్మికుంటలోనూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అబార్షన్ ఘటన వెలుగు చూడగా.. హుజురాబాద్ లో రెండు నెలల క్రితం అబార్షన్ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అన్ని ఘటనల్లోనూ జిల్లా  వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపులేనితనం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఆడ పిండమని అబార్షన్ చేస్తే.. 


కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చడంతో కుటుంబసభ్యులు వావిలాపల్లిలోని ఓ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. గైనకాలజిస్టు పేరుతోనే ఉన్న సదరు హాస్పిటల్‌‌లో స్కానింగ్ చేయగా.. పుట్టబోయేది ఆడ పిల్ల  అని తెలిసింది. దీంతో అబార్షన్‌‌కు సిద్ధమయ్యారు. హాస్పిటల్‌‌లో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్‌‌కు యత్నించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన ట్రీట్ మెంట్‌‌కు రూ..2 లక్షలు ఖర్చవుతాయని డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక అడిగినంత చెల్లించి అబార్షన్ చేయించారు.

తీరా అబార్షన్ చేశాక పుట్టబోయేది మగశిశువు అని తెలిసి సదరు యువతి కుటుంబ సభ్యులు షాక్ కు గురై డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విషయం యువతి కుటుంబసభ్యుల ద్వారా జిల్లా వైద్యశాఖలోని ఓ ఆఫీసర్ కు తెలియడంతో.. నామమాత్రంగా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. 

కేసులైనా డోంట్ కేర్.. 

నిరుడు జమ్మికుంటలోని శ్రీవిజయసాయి హాస్పిటల్ లో నిర్వహిస్తున్న స్కానింగ్ దందాపై అప్పట్లో సీఎంవోకు ఫిర్యాదు అందింది. దీంతో సీఎంవో ఆదేశాలతో హెల్త్ అండ్‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డైరెక్షన్ లో నిరుడు మే15న అప్పటి డీఎంహెచ్‌‌వో మూడు టీమ్‌‌లతో జమ్మికుంటలోని హాస్పిటళ్లను తనిఖీ చేశారు. దీంతో శ్రీవిజయసాయి హాస్పిటల్‌‌లో లో జరుగుతున్న అబార్షన్ వ్యవహారం వెలుగు చూడడంతో సీజ్ చేశారు.   ఈ ఏడాది జులైలో హుజూరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే బయటకు వచ్చింది.

హుస్నాబాద్‌‌కు చెందిన మహిళకు ఆమె కుటుంబ సభ్యులు హుజూరాబాద్‌‌లోని మాధవి నర్సింగ్ హోంలో ఆర్నెళ్ల కింద బలవంతంగా అబార్షన్ చేయించారు. ఇందుకు జమ్మికుంటకు చెందిన ఆర్‌‌‌‌ఎంపీ సిరిసేటి అశోక్, నర్సింగ్ హోం నిర్వాహకుడు కర్రె పాపిరెడ్డి, కాంపౌండర్ రావుల సత్యనారాయణ, నర్సు బొల్లారం లక్ష్మి సహకరించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాతగానీ డీఎంహెచ్‌‌వో, ఇతర ఆఫీసర్లు తమ ఆఫీసు నుంచి కదల్లేదు. తీరిగ్గా రెండు రోజులకు నర్సింగ్ హోంను 
సీజ్ చేశారు.


రూ.10 వేలకు స్కానింగ్.. రూ.30 వేలకు అబార్షన్.. 

జిల్లాలోని పలు హాస్పిటళ్లలో 107 స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుండగా.. చాలా హాస్పిటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నాయి. లింగ నిర్ధారణ టెస్ట్‌‌లు చేయొద్దని సర్కార్ ఆదేశాలున్నా.. వాటిని బేఖాతర్‌‌‌‌ చేస్తూ ఆడ శిశువు అని తేలితే అబార్షన్లు చేసేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం.. మరో రూ.30 వేలు ఇస్తే అబార్షన్ చేయడం ఓ స్కీమ్‌‌లా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇందులో ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుండడంతో ఏదైనా వివాదస్పదమైతే తప్ప అబార్షన్​ఘటనలు బయటికి రావడం లేదు.