జోరుగా కలప అక్రమ రవాణా పట్టించుకోని అటవీ శాఖ
చెట్లతో కళకళలాడే దట్టమైన అడవులు అక్రమార్కుల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో లక్షల విలువ చేసే టేకు చెట్లను దుంగలుగా నరికి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అటవీ శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో సుమారు 40 వేల ఎకరాల్లో అడవులు ఉన్నాయి. ఇందులో ఎంతో విలువైన టేకు, జిట్టేగి, మద్ది, ఇప్ప, నంగి, సిరిమాను తదితర రకాల చెట్లు విస్తారంగా ఉన్నాయి. లింగంపేట మండలంలోని మెంగారం, బోనాల్, శెట్పల్లి, భవానీపేట, ముంబాజీపేట, బానాపూర్, కంచ్‌మల్, పోతాయిపల్లి, ముస్తాపూర్, కోమట్‌పల్లి, జల్దిపల్లి, పర్మల్ల తదితర అటవీ ప్రాంతాల్లో టేకు చెట్లు విస్తారంగా ఉన్నాయి.
దీంతో కొందరు టేకు కలపను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్ పరిధిలో నిత్యం ఏదో ఓ చోట టేకు చెట్ల నరికి వేత జరుగుతూనే ఉంది. నరికిన టేకు దుంగలను రాత్రి వేళల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మెదక్ పట్టణాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. లింగంపేట మండలంలోని మెంగారం, బోనాల్ అడవుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది.
కొరవడిన నిఘా..
అడవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం లక్ష్యం నెరవేరడం లేదు. అడవులు, అటవీ భూముల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కొంత మంది కింది స్థాయి సిబ్బంది మాత్రం తనిఖీలు చేసి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫర్నీచర్ రూపంలో..
టేకు కలప అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు కొత్త దారులు వెతుకుతున్నారు. గతంలో అడవుల్లో ఏపుగా పెరిగిన టేకు చెట్లను నరికి దుంగలుగా వాహనాల్లో పట్టణ ప్రాంతాలకు తరలించే వారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. డైనింగ్టేబుళ్లు, సోఫాలు, మంచాలు, కిటికీలు, డోర్లు, చౌకోట్లు తదితర వస్తువులను తయారు చేయించి పట్టణలకు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పర్నీచర్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.
వాహనాలున్నా తనిఖీలు సున్నా..
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అడవుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. హరితహారం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటించింది. మరోవైపు స్మగ్లర్ల బారి నుంచి అడవులను కాపాడేందుకు ఫారెస్టు సిబ్బందికి బైక్‌లు సమకూర్చింది. ఉద్యోగం ఉన్న చోటనే నివాసం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ అటవీ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది కొందరు స్థానికంగా ఉండక పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో అడవులపై నిఘా కొరవడింది.
పెట్రోలింగ్ చేస్తున్నాం..
టేకు కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నాం. ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్పరిధిలో చెట్లను నరికివేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. స్థానికులు కూడా ఫారెస్టు సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అటవీ సిబ్బంది స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.- ఓంకార్, రేంజ్ ఆఫీసర్, ఎల్లారెడ్డి
చెట్లతో కళకళలాడే దట్టమైన అడవులు అక్రమార్కుల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో లక్షల విలువ చేసే టేకు చెట్లను దుంగలుగా నరికి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అటవీ శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.