- కొండను తవ్వి లోయగా మార్చి..
- పక్కనే ఉన్న జూబ్లీహిల్స్ ప్లాట్ కు లింక్ చేసి..
- జీహెచ్ఎంసీ నుంచి ఇల్లీగల్ పర్మిషన్
- ఆ వెంటనే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం
- అక్రమాను నిర్ధారించిన విజిలెన్స్ విభాగం
- ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు
- నందగిరి సొసైటీ సభ్యుడు రాఘవాచారి
- విజిలెన్స్ రిపోర్టును అమలు చేయాలి
- న్యాయపోరాటం చేస్తం: ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి
హైదరాబాద్: నివాస ప్రాంతాలకే అనుమతించిన నందగిరి హిల్స్ లో కొందరు వ్యక్తులు కమర్షియల్ దందాకు తెరలేపారని ఆరోపణలున్నాయి.హెచ్ఎండీలో వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంస్థ దానికి ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లోని 860 గజాల జాగా కొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారని నందగిరి సొసైటీ సభ్యుడు రాఘవాచారి తెలిపారు.
ఇవాళ మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘నందగిరి హిల్స్ లోని 4.7 ఎకరాల స్థలాన్ని 2012 లో హెచ్ఎండీఏ వేలం ద్వారా విక్రయించింది. వాస్తవానికి నందగిరి హిల్స్ రెసిడెన్షియల్ ప్రాంతం.. ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టవద్దు. జీ ప్లస్ 4 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
2013లో నిబంధనల మేరకు జీప్లస్ 4కు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సదరు భూమిని దక్కించుకున్న వ్యక్తి నందగిరి కొండను 100 మీటర్లు తవ్వి లోయగా మార్చేశారు. ఆ తర్వాత దానికి ఆనుకుని ఉన్న 860 చదరపు గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఆ ప్లాట్ ఫేస్ జూబ్లీహిల్స్ 45 వైపు ఉంది. దీంతో రెండింటిని కలిపేసి కమర్షియల్ కట్టడాలకు తెరలేపారు.
ALSO READ | కావూరి హిల్స్లోకి హైడ్రా ఎంట్రీ..!
ప్రస్తుతం ఈ 4.7 ఎకరాల్లో 115 మీటర్ల ఎత్తులో నెట్ నెట్ వెంచర్స్ వారు మెగా కమర్షియల్ కాంప్లెక్స్ను కడుతున్నారు. కేబీఆర్ పార్కు పక్కనే ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ మేం జీహెచ్ఎంసీ కమిషనర్ కు కంప్లయింట్ చేశాం. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంటుకు ఫిర్యాదు చేశాం.. వాళ్లు పరిశీలించి అక్రమమని తేల్చారు. జూబ్లీ హిల్స్ ప్లాట్ కాదని, నందగిరి ప్లాట్ లో నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు.
లక్షా 50 వేల స్క్వేర్ మీటర్లు దాటిన బిల్డింగ్స్ కి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీరు పబ్లిక్ హియరింగ్ లేకుండా పాత అప్రూవల్ చూపించి కన్స్ట్రక్షన్ చేశారు. విజిలెన్స్ అధికారుల రిపోర్టును అమలు చేయాలని కోరుతూ మేం హైకోర్టును ఆశ్రయించాం.. మున్సిపల్ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని అడిగింది. ఇప్పటికీ పనులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. దీనిపై త్వరలోనే హైడ్రాకు కంప్లయింట్ చేయబోతున్నం.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు కూడా వెళ్తం’ అని రాఘవాచారి తెలిపారు. ఇదే అంశంపై మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా పైరవీలు చేయకుండా న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర అందుకే ప్రస్తావించలేదని అన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ అమలు చేయాలని, లేని పక్షంలో రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ గా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణంపై హైడ్రా, మున్సిపల్ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.