వనపర్తి జిల్లాలో మిల్లర్లపై క్రిమినల్​ కేసులవుతున్నా ఆగని దందా

వనపర్తి జిల్లాలో మిల్లర్లపై క్రిమినల్​ కేసులవుతున్నా ఆగని దందా
  • మిల్లుల్లో రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం

వనపర్తి, వెలుగు :  జిల్లాలో మిల్లర్ల  అక్రమ  దందా కొనసాగుతూనే ఉంది.  తక్కువ ధరకు రేషన్​ బియ్యాన్ని  కొని  , సీఎంఆర్​ గా మారుస్తూ.. అధికారులకు అప్పగిస్తున్నారు.  సీఎంఆర్​ అవకతవకలపై  సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు క్రిమినల్​ కేసులు నమోదు చేస్తున్నా.. కొందరు అక్రమార్కుల తీరు మారడం లేదు.  ఇటీవల పెబ్బేరు మండలం రంగాపూర్​లోని మూడు  రైస్​మిల్లుల్లో ధాన్యం కేటాయింపుల్లో వ్యత్యాస ముండడంతో ముగ్గురు మిల్లర్లపైన క్రిమినల్​ కేసులు నమోదు చేశారు.

ఈ మూడు మూడు   వేర్వేరు పేర్లమీదా ఉన్నా ఒకే   కుటుంబానికి చెందినవిగా తెలుస్తోంది. ఇక్కడ తేలిన సీఎంఆర్​ ధాన్యం వ్యత్యాసం విలువ మొత్తం రూ.8.99కోట్లు. గతంలో చిన్నంబావి మండలంలో ఒక మిల్లరుపైనా క్రిమినల్​ కేసు నమోదు చేశారు. ఇక్కడ రూ.3కోట్ల విలువగల ధాన్యం లెక్క తేలలేదు. సీఎంఆర్​ పెండింగ్​ ఉంటున్నప్పటికీ సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు ఆయా మిల్లులకు సీజన్​ల వారీగా ధాన్యం కేటాయిస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా తాజా సంఘటనలతో బలపడుతున్నాయి. 

చక్రం తిప్పేది ఒక్కరేనా?

తమ మిల్లులకు సీఎంఆర్​ ధాన్యాన్ని కేటాయింప జేసుకున్న మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకుండా బహిరంగ మార్కెట్​లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో 178దాకా రైసుమిల్లులు ఉన్నా సకాలంలో సీఎంఆర్​ ఇచ్చే మిల్లులు తక్కువే. సింహభాగం మిల్లర్లు రేషన్​ బియ్యాన్ని కార్డుదారుల నుంచి కిలో రూ.10,-12లకు కొని మిల్లులో పాలిష్ పట్టించి సీఎంఆర్​ కింద అప్పగిస్తున్నారు.  రైస్​ మిల్లర్ల సంఘం నేత ఒకరు ఆఫీసర్లను మేనేజ్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆఫీసర్లు కూడా ఫిర్యాదులు వచ్చినప్పుడే తూతూ మంత్రంగా తనిఖీలు  చేస్తున్నారు. అయినా మిల్లర్లలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. 

మూణ్నెళ్ల కింద జిల్లాలో కొందరు మిల్లర్ల ఆస్తులను జప్తు చేయగా పలుకుబడి ఉపయోగించి  ఆస్తుల జోలికి పోకుండా చూసుకున్నారు. జిల్లా మిల్లర్ల సంఘం ప్రధాన ప్రతినిధికి చెందిన ఖిల్లాగణపురం మండలంలోని  మిల్లులకు రేషన్​ బియ్యం యథేచ్చగా వస్తోందని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లే చెప్తున్నారు.   జిల్లాలో పెబ్బేరు, ఖిల్లాగణపురం, ఆత్మకూరు, కొత్తకోట, మదనాపూర్​, వనపర్తి మండలాల్లోని పలు చోట్ల రేషన్​ బియ్యం పట్టుబడింది. 

పట్టుబడిన బియ్యాన్ని పోలీస్​ స్టేషన్లకు తరలించి సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లకు సమాచారమిస్తుండడంతో అవి రేషన్​ బియ్యమని చెప్పలేమని షాంపిళ్లను ల్యాబ్​కు పంపుతున్నామంటూ దాటవేస్తున్నారు. ఇది కూడా ఒకంతుకు మిల్లర్లకు కలిసొచ్చే అంశమే. జిల్లాలో యథేచ్చగా రేషన్​ బియ్యం దందా విషయమై సివిల్​ సప్లయ్​ డీఎం జగన్మోహన్​ను వెలుగు వివరణ కోరగా తనిఖీలు ఆపబోమని, కేటాయించిన సీఎంఆర్​ ధాన్యంలో వ్యత్యాసం తేలితే ఆయా మిల్లర్లపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. 

85బస్తాల రేషన్​ బియ్యం స్వాధీనం

శనివారం ఖిల్లాగణపురం మండలం సోలీపూర్​లో తినేటి సాయికుమార్​రెడ్డి గ్రామశివారులో దాచిన 85బస్తాల రేషన్​ బియ్యాన్ని సీఎస్​ డిప్యూటీ తహసీల్దార్​ పరమేశ్​ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. బియ్యాన్ని స్టాక్​ పాయింట్​కు తరలించగా ఎస్సై సురేష్​గౌడ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.