జానయ్యపై అక్రమ కేసులు ఎత్తేయాల్సిందే

సూర్యాపేట, వెలుగు : జానయ్యపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని, ఆయనపై ఈగ వాలినా మంత్రి జగదీశ్​రెడ్డే  బాధ్యత వహించాల్సి ఉంటుందని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్ యాదవ్  అన్నారు. బీఆర్ఎస్​ నేత, నల్గొండ డీసీఎంఎస్​ చైర్మన్  వట్టె  జానయ్య యాదవ్ కు మద్దతుగా శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్​యాదవ్​ మాట్లాడారు. 

జానయ్య భూములు అక్రమించారని వస్తున్న ఆరోపణలపై తాము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, ఆ ఆరోపణలు నిజమని తేలితే బాధితులకు అండగా ఉంటామన్నారు. కానీ, సూర్యాపేట పోలీసులు జానయ్యపై కుట్రపూరితంగా కేసులు పెట్టడం, రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. బహుజన వర్గాలకు చెందిన బెల్లి లలిత, కోనపురి సాంబశివుడు, కోనపురి రామును దారుణంగా హత్య చేసినప్పుడు ఏ ఒక్క అగ్రకుల నాయకుడూ మాట్లాడలేదని, ఇప్పుడు బీసీ సామాజికవర్గానికి చెందిన జానయ్యపై జరుగుతున్న కుట్రలను కూడా అదే కోణంలో చూడాలన్నారు. జానయ్యకు యావత్  యాదవ సమాజం అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నిజానిజాలు తేల్చుకోకుండా కొన్ని టీవీ చానెళ్లు జానయ్యను నయా నయీమ్​గా, నరరూప రాక్షసునిగా పేర్కొనడం అత్యంత దుర్మార్గమన్నారు. యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాదం బాలరాజు యాదవ్  మాట్లాడుతూ జానయ్య గత 30 ఏళ్లలో ప్రజాక్షేత్రంలో ఉంటూ బహుజనుల పక్షాన అనేక సేవలు అందించారని అన్నారు. 

గత పదేండ్లుగా ఆయనను తన వెంట తిప్పుకున్న మంత్రి.. జానయ్య టికెట్​ఆశించేసరికి ఒక్కరోజులోనే జానయ్యని భూకబ్జాదారునిగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. జానయ్యపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని, లేదంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్  మతిభ్రమించి మాట్లాడుతున్నారని, మంత్రి జగదీశ్​రెడ్డిని యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామితో పోల్చడం హేయమైన చర్య అన్నారు. 

యాదవుల కోటాలో ఎంపీ పదవి పొందిన లింగయ్య.. అగ్రకులాలకు తొత్తులుగా మారి యాదవ సమాజాన్ని చీల్చాలని చూస్తే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అక్షిత యాదవ్, యాదవ న్యాయవాదుల  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండ్ర మల్లయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.