సర్కారు బడిలో స్టూడెంట్ల నుంచి.. అక్రమ వసూళ్లు

జగిత్యాల/రాయికల్, వెలుగు :  గురుకుల ఎంట్రెన్స్​ టెస్ట్​ కోచింగ్, ప్రైవేట్​టీచర్ల ఫీజుల పేరుతో జగిత్యాల జిల్లా రాయికల్​మండలం కట్కాపూర్​మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని స్టూడెంట్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. అడిగిన ఫీజు కట్టలేదని మూడో క్లాస్ స్టూడెంట్ ఎండీ లాస్యను ఎండలో నిలుచోబెట్టారంటూ, పాప తల్లి ఆస్మా ప్రజావాణిలో కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు.

పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కో స్టూడెంట్​నుంచి రూ.200 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం కట్కాపూర్​స్కూలులో 1 నుంచి 5వ తరగతి వరకు 74 మంది చదువుకుంటున్నారు. వీరి కోసం ఇద్దరు రెగ్యులర్ టీచర్లు, ఓ డిప్యుటేషన్​పై ఉన్న టీచర్​తోపాటు నలుగురు ప్రైవేట్ టీచర్లు(వీవీ) పనిచేస్తున్నారు. వీవీల జీతాల కోసం పేరెంట్స్​కమిటీ స్టూడెంట్ల నుంచి పైసలు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వసూళ్ల విషయంపై తమకేం తెలియదని, పేరెంట్స్ కమిటీనే చూసుకుంటుందని హెచ్ఎం మల్లేశం ‘వెలుగు’కు తెలిపారు.