జీడిమెట్ల, వెలుగు: తనిఖీల పేరుతో ఓ హోటల్‌కు వెళ్లి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఇద్దరు మహిళలపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ విజయవర్ధన్ వివరాల ప్రకారం... మలక్ పేట్ ప్రాంతానికి చెందిన సునీత(50), సికింద్రాబాద్ కు చెందిన విజయలక్ష్మి(58) ఈ నెల 23న సుచిత్ర లోని గిస్మత్ మండికి హోటల్ కు వెళ్లారు. తాము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చామని చెప్పారు. హోటల్ లోపల భాగం శుభ్రంగా ఉందా? అంటూ వంట గదిలోకి వెళ్లి పరిశీలించారు.
అనంతరం పరిసరాలు సరిగా లేవని హోటల్ సీజ్ చేస్తామంటూ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకొని విచారించగా నకిలీ వ్యక్తులని తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. కాగా గతంలో సైతం ఇతర హోటళ్ల వద్ద వసూళ్ళు చేసినట్లు పోలీసులు తెలిపారు.