- స్టేట్‌హైవే రోడ్కల్వర్ట్పై పారాపెట్వాల్కూల్చి మరీ కట్టడాలు
- డ్రైనేజీలను డైవర్ట్ చేస్తున్నరు తప్ప చర్యలు తీసుకోని ఆఫీసర్లు!
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు చుంచుపల్లి మండలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కబ్జాదారులు నాలాలను కూడా వదలడం లేదు. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తూ కల్వర్ట్లపై కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు ఉంటున్నారు. కబ్జా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోపోగా డ్రైనేజీలను డైవర్ట్ చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారని ఆఫీసర్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పారాపెట్ వాల్నే కూల్చేసిన్రు..
ఖమ్మం నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలం వెళ్లే స్టేట్ హైవే వెంట జిల్లాలోని చుంచుపల్లి మండలంలో ప్రమాదాలను నివారణకు ఆర్అండ్బీ అధికారులు పారాపెట్ వాల్‌ను నిర్మించారు. కానీ ఆ వాల్‌ను కొందరు వారి నిర్మాణాలకు అనుకూలంగా ఉండేందుకు రాత్రికిరాత్రి కూల్చివేశారు. ఇదే హైవేపై మరోచోట కల్వర్టుపైనే కొందరు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చుంచుపల్లి మండలంలో రాజకీయ పలుకుబడితో బడాబాబులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఎక్కువైంది.
పంచాయతీ ఆఫీసర్లు ఒకటి రెండు సార్లు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. మండలంలోని విద్యానగర్ కాలనీలో స్టేట్ హైవేకు ఇరు వైపులా డ్రైనేజీ నిర్మాణాలను ఎవరికి వారు ఆక్రమించుకొని అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కొత్తగూడెంలో..
కొత్తగూడెం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బడాబాబులకు కొందరు ఆఫీసర్ల అండ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని ఓల్డ్ బస్ డిపో నుంచి పాత కొత్తగూడెం వెళ్లే రోడ్, లేపాక్షి రోడ్, సూర్యాప్యాలెస్ ఏరియా నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు మెయిన్‌రోడ్‌కు ఇరువైపులా నిర్మించి డ్రైనేజీ నిర్మాణాలను బడాబాబులకు అనుకూలంగా చేపట్టడంతో అవి అష్టవంకర్లు తిరిగాయి. లేపాక్షి రోడ్ నుంచి ఎంజీ రోడ్ వరకు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఓ బడాబాబుకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసి డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆ కట్టడం జోలికి వెళ్లకుండా మధ్యలోనే ఆపేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అనుమతి లేని నిర్మాణాలను 20కి పైగా గుర్తించిన ఆఫీసర్లు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
చుంచుపల్లి మండలంలో స్టేట్ హైవేలో కల్వర్ట్‌పై నిర్మించిన పారాపెట్ వాల్‌ను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలని డీఈ, జేఈలను ఆదేశించాం. వారి రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయి. ఎవరైతే కూల్చారో వారితోనే వాల్ కట్టిపిస్తాం.
బీమ్లా, ఈఈ, ఆర్అండ్బీ భద్రాద్రికొత్తగూడెం
అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇస్తున్నాం..
విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో అక్రమ నిర్మాణాలు చేపట్టినవారికి ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
బాబూరావు, విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ సెక్రటరీ