ఆలయ జాగలో అక్రమ నిర్మాణం?

  • రూ.25 కోట్ల విలువైన బాలరాజేశ్వర గుడి భూమి అన్యాక్రాంతం
  • నకిలీ పేపర్లతో 20 గుంటలు కబ్జా చేసిన లీడర్లు
  • అవి ఆలయ భూములేనని మూడు సార్లు తీర్పు ఇచ్చిన కోర్టు
  • పాత కలెక్టర్ పోగానే రికార్డులు మార్చిన కొందరు ఆఫీసర్లు 
  • తీర్పు అమలులో ఆఫీసర్ల మీనమేషాలు
  • గులాబీ లీడర్లు, ఆఫీసర్ల సాయంతో అక్రమ నిర్మాణాలు

వరంగల్‍, వెలుగు: హనుమకొండ అశోక టాకీస్‍ పక్క నుంచి శ్రీదేవి ఏషియన్‍ మాల్‍ వెళ్లే రూట్​లోని శ్రీబాలరాజేశ్వర స్వామి ఆలయ భూమి కబ్జాకు గురైంది. మంచి కమర్షియల్‍ ఏరియాలో ఉన్న ఆలయ భూమిలో రూ.25కోట్ల విలువైన అర ఎకరం జాగ అన్యాక్రాంతం అయింది. కొందరు లీడర్లు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేశారు. అంతేకాక నాలుగు అంతస్తుల  కమర్షియల్ క్లాంప్లెక్స్ సైతం నిర్మిస్తున్నారు. అవి ఆలయ భూములేనని జిల్లా కోర్టు గతంలో మూడు సార్లు తీర్పు ఇచ్చినా ఆఫీసర్లు అమలు చేయడం లేదు.

ఇదీ సంగతి..

11,12 శతాబ్దాల నాటి బాలరాజేశ్వర ఆలయంలో 27 గుంటల జాగా ఉంది. ఇది ఆలయానికి చెందినవిగా పురావస్తుశాఖ సైతం గుర్తించింది. 1954లో కొందరు వ్యక్తులు నకిలీ పేపర్లు సృష్టించి 20 గుంటల భూమిని తమ పేర్ల మీదకు రికార్డులు మార్చుకున్నారు. వారే ఆలయానికి 877 గజాలు దానంగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు 20 ఏండ్ల క్రితమే రికార్డులతో సహా కోర్టుకు వెళ్లారు. కాగా, తన భూమిగా చెప్పుకున్న కొత్తపల్లి వాసుదేవరెడ్డి దానిని నిరూపించుకోలేకపోయారు. దీంతో ఆ కేసును కొట్టేశారు. ఆలయ కమిటీని అనుకూలంగా 2003, 2010, 2016లో జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూములను కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్‍కు అప్పజెప్పింది. కానీ నేటి వరకు ఆ తీర్పు అమలు కాలేదు.

కరోనా పేరుతో జాప్యం..

కబ్జాకు గురైన బాలరాజేశ్వర స్వామి ఆలయ భూమి ని కాపాడే బాధ్యతలను అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​కు కోర్టు అప్పజెప్పింది. కానీ కొందరు కిందిస్థాయి ఆఫీసర్లు కరోనా పేరుతో, గులాబీ లీడర్ల సహకారంతో కలెక్టర్‍ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదు. పాత కలెక్టర్‍ ఇక్కడి నుంచి ట్రాన్స్​ఫర్‍ కాగానే రికార్డులు మార్చి, కబ్జాదారులకు సహకరించారు.  దీంతో ఆలయ కమిటీ సభ్యులు లోకాయుక్త కోర్టుకు వెళ్లారు. దీనిపై రెండేళ్లుగా విచారణ నడుస్తోంది. కోర్టు పలుమార్లు జిల్లా అధికారులకు నోటీసులు కూడా పంపింది. అయినా ఉన్నతాధికారులు వెళ్లలేదు. దీంతో లోకాయుక్త సీరియస్‍ అయింది. ఈ నెల 19న తప్పకుండా విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్‍, గ్రేటర్‍ కమిషనర్‍, ఆర్డీవో స్థాయి ఆఫీసర్లకు నోటీసులు పంపింది.

గులాబీ లీడర్ల సాయంతో అక్రమ నిర్మాణం..

ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు తీర్పు ఇచ్చింది. నిర్మాణానికి కావాల్సిన పర్మిషన్ సైతం అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. కానీ కబ్జా చేసిన వ్యక్తి.. కొందరు గులాబీ లీడర్లతో చేతులు కలిపాడు. అధికారుల సహకారంతో రికార్డులు మార్చారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి, ఆలయానికి కేవలం 877 గజాలు మాత్రమే ఉన్నట్లుగా అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆ 20 గుంటలను అందరూ కలిసి ఆక్రమించుకున్నారు. ఇదేంటని అడిగితే వాసుదేవరెడ్డి వద్ద స్థలం కొనుగోలు చేశామని చెబుతున్నారు.

ఆఫీసర్లపై.. కోర్ట్ సీరియస్‍

కోర్టు తీర్పును కాదని అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై లోకాయుక్తలోనూ 2020 నుంచి కేసు నడుస్తోంది. జిల్లా ఉన్నాతాధికారులు విచారణకు రావాలంటూ పంపిన కోర్టు నోటీసులను కాదని.. కిందిస్థాయి అధికారులను పంపారు. దీంతో అప్పట్లో కోర్టు సీరియస్‍ అయింది. ఆఫీసర్లు  రాకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపడాన్ని తప్పుపట్టింది.  ఈనెల 19న నిర్వహించే విచారణకు తప్పక హాజరుకావాలని సూచించింది. జిల్లా కలెక్టర్‍, గ్రేటర్‍ కమిషనర్‍ లేదంటే ఈ అంశాన్ని మొదటినుంచి చూస్తున్న ఆర్టీవో స్థాయి అధికారులు వెళ్లాల్సి ఉంది. 

కోర్ట్ తీర్పులను గౌరవించట్లే 

కోర్టు తీర్పులను అధికారులు గౌరవించట్లేదు. వాసుదేవరెడ్డి, ఆయన ఫ్యామిలీ 1954లో నకిలీ పేపర్లతో కబ్జా చేసినట్లు కోర్ట్ మూడుసార్లు తీర్పు ఇచ్చింది.  భూముల పరిరక్షణను కలెక్టర్‍కు అప్పజెప్పింది. కాగా కొందరు అధికారులు రికార్డులు మార్చి కబ్జాదారులకు సహకరిస్తున్నారు. యజమాని కాని వ్యక్తి భూములు అమ్మితే రిజిస్ట్రేషన్‍ అధికారులు దానిని వారి పేరుమీదకు మారుస్తున్నారు. అదేటైంలో లోకాయుక్త విచారణకు అధికారులు రావడం లేదు.

- చీకటి రాజు (కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ సమితి కన్వీనర్‍)