- గద్వాలలో మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల కుమ్మక్కు
- ఫేక్ టీ పాస్ తో పర్మిషన్లు
- చేతులు మారుతున్న లక్షల రూపాయలు
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా కేంద్రంలో రిక్రియేషన్ జోన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై ఫేక్ టీ పాస్‌లతో పర్మిషన్లు ఇచ్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల రిక్రియేషన్ జోన్ లో జోరుగా పర్మిషన్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడ ప్లాట్లు వేయవద్దనే నిబంధన ఉన్నప్పటికీ, ఏకంగా వెంచర్లు వేసి ఇండ్లు సైతం కట్టేస్తున్నారంటే అవినీతి ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీరికి టౌన్ ప్లానింగ్ లోని కొందరు ఆఫీసర్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
85 ఎకరాల్లో రిక్విజేషన్ జోన్..
అగ్రహారం వెళ్లే మార్గంలోని 489, 173, 480, 488 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 1985 మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ లో 85 ఎకరాలను రిక్రియేషన్ జోన్ గా గుర్తించారు. ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్రీడలను డెవలప్ చేసేందుకు స్టేడియం నిర్మించేందుకు, ఆటలు ఆడేందుకు స్థలం అవసరమవుతుందనే ఉద్దేశంతో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వవద్దని, అవసరమైతే మున్సిపాలిటీ సేకరించేలా రిక్రియేషన్ జోన్ గా ప్రకటించారు. ఇక్కడ వెంచర్లు, ప్లాట్లు వేసేందుకు, ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్లు ఇవ్వకూడదు. కానీ, కొందరు అక్రమార్కులు ఆఫీసర్లతో కుమ్మక్కై ఇష్టానుసారంగా పర్మిషన్లు తీసుకుంటున్నారు.
ఫేక్ టీ- పాస్‌తో పర్మిషన్..
రిక్రియేషన్ జోన్ లో ప్లాట్లు, వెంచర్ వేసేందుకు, ఇండ్లు కట్టుకునేందుకు గవర్నమెంట్ నుంచి ఆ సర్వే నంబర్ పై క్లియరెన్స్ తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి ఆ పొలాలను కొనుగోలు చేయలేమని లెటర్ ఇచ్చాక, ఆ సర్వే నంబర్ లో ప్లాట్లకు, ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వవచ్చు. గవర్నమెంట్ నుంచి సదరు సర్వే నంబర్లకు పర్మిషన్ తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. దీంతో అడ్డదారుల్లో ఫేక్ టీ- పాస్‌లతో పర్మిషన్లు ఇచ్చేసి ఇండ్లు నిర్మిస్తున్నారు.
చేతులు మారుతున్న లక్షల రూపాయలు..
రిక్రియేషన్ జోన్ లో పర్మిషన్లకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లాట్ లో ఇంటి పర్మిషన్ కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పర్మిషన్లు ఇచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఫేక్ టీ- పాస్ పర్మిషన్లు తీసుకున్న ఇంటి ఓనర్లు ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు పేర్కొంటుండగా, ఎవరు బాధ్యత వహిస్తారని ఆఫీసర్లను ప్రశ్నిస్తున్నారు.
ఇండ్ల పర్మిషన్లపై దృష్టి పెడతాం..
రిక్రియేషన్ జోన్ లో పర్మిషన్ ఇస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఆన్ లైన్ లో పర్మిషన్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో చర్చించి దీనిపై చర్యలు తీసుకుంటాం. రిక్రియేషన్ జోన్ లో ఇచ్చిన పర్మిషన్లను రద్దు చేస్తాం.
దశరథం, మున్సిపల్ కమిషనర్, గద్వాల