మన్యంలో అడ్డగోలుగా ..అక్రమ నిర్మాణాలు!

  •     గిరిజన చట్టాలను తుంగలో తొక్కి ‘రియల్’ వ్యాపారం 
  •     రూ.కోట్లు పెట్టి భూముల క్రయ, విక్రయాలు 
  •     అనుమతుల్లేకుండా బహుళ అంతస్తులు వెలుస్తున్నా పట్టించుకోని అధికారులు 

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇక్కడ రియల్​ఎస్టేట్​ వ్యాపారం జోరుగా నడుస్తోంది. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి అడ్డగోలుగా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

కలెక్టర్​కు ఫిర్యాదు

గత నెలలో పూనెం ప్రదీప్​ అనే వ్యక్తి భద్రాచలం పట్టణంలో 60కు పైగా అక్రమ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో అక్రమ భవనాల గుట్టు రట్టయింది. 

ఆ భూములు కొనొద్దు.. కానీ..  

ఏజెన్సీ ఏరియాలో 5వ షెడ్యూల్​ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకూడదు. కేవలం గిరిజనులకు మాత్రమే ఆ హక్కును రాజ్యాంగం కల్పించింది. నివాస అవసరాలకు ఇతరులకు కొంత మినహాయింపు ఉన్నా, దాన్ని దుర్వినియోగం చేసి గిరిజనేతరులు భూములు కొంటున్నారు. భవనం కట్టాలంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలి. భూమిపై ఉన్న హక్కు పత్రాలను చూపించాలి.

టౌన్​ ప్లానింగ్ ఆఫీసర్ ​అనుమతి ఉంటేనే భవన నిర్మాణం చేపట్టాలి. కానీ అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు. ఈ భవనాల నిర్మాణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.కోట్లలో భూముల ధరలు.

గిరిజన చట్టాలున్నా భద్రాచలం పట్టణంలో భవనాలు, భూముల అమ్మకాల జోరు తగ్గడం లేదు. రామాలయం వెళ్లే మార్గంలో ఓ థియేటర్​ను రూ.6కోట్లతో కొనుగోలు చేశారు. విజయవాడ-–జగదల్​పూర్​ జాతీయ రహదారిపై కూడా మరో థియేటర్​ రూ.15కోట్లు పలికింది. కూనవరం రోడ్డులో టౌన్​ శివారున పాత ఆర్టీవో ఆఫీసు ఎదురుగా రెండెకరాల భూమిని రూ.3కోట్లకు కొనుగోలు చేశారు. ఇలా రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు కొనుగోలు చేస్తూ స్థానికంగా సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 

అంతా చట్ట విరుద్ధమే.. 

భద్రాచలం ఏజెన్సీలో జరిగే క్రయ, విక్రయాలన్నీ చట్ట విరుద్ధమే. భవన నిర్మాణాలకు అనుమతుల్లేవు. డ్రైన్లు, ఫుట్ పాత్​లు ఆక్రమించి భవనాలు కడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే డ్రైన్​వాటర్ రోడ్డుపై పారుతుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి.

పూనెం ప్రదీప్​కుమార్​, భద్రాచలం

పరిశీలిస్తున్నాం 

అక్రమ నిర్మాణాలపై తహసీల్దారు ద్వారా కొంత సమాచారం వచ్చింది. బిల్డింగ్​లను పరిశీలిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

మంగీలాల్, ఆర్డీవో, భద్రాచలం