కబ్జాలపై ఉక్కుపాదం..కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా

  •     ప్రతి ఫిర్యాదుపై క్షుణ్ణంగా పరిశీలన
  •     అన్నీ తేల్చుకున్నాకే రంగంలోకి.. ఇప్పటికే సర్కారు దగ్గర లిస్ట్ 
  •     పాత, కొత్త ఫిర్యాదులపై క్రాస్​చెక్​ చేసుకొని ముందుకు..
  •     ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ నిర్మాణాల్లో 95 శాతం బడాబాబులవే

హైదరాబాద్, వెలుగు : ఎఫ్​టీఎల్​​, బఫర్​ జోన్​లలో ఉన్న అక్రమ నిర్మాణాలను  ‘హైడ్రా’ పక్కా ప్లాన్​ ప్రకారం కూల్చివేస్తున్నది.   అక్రమ నిర్మాణం అని అన్ని రకాలుగా తేల్చుకున్నాకే రంగంలోకి దిగుతున్నది. ఎఫ్ టీఎల్, బఫర్​ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన దాంట్లో 95 శాతం బడా బాబులే ఉండడం, అందులోనూ వారందరూ వివిధ స్థాయిల్లో పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పూర్తి సమాచారం, ఆధారాలతో ముందుకు వెళ్తున్నది. పైగా కోర్టుల్లోనూ ఎక్కడా సమస్య రాకుండా అడుగులు వేస్తున్నది. 

అక్రమ నిర్మాణాల్లో పెద్ద వ్యక్తులు ఉండడంతోనే హైడ్రాకు సీఎంను చైర్​పర్సన్​గా నియమించారని తెలుస్తున్నది. హైడ్రా ఏర్పాటైన 35 రోజుల్లోనే వివిధ రూపాల్లో వందల కంప్లయింట్స్​ వచ్చాయి. ఇప్పటికే దాదాపు 600కు పైగా ఫిర్యాదులు అందినట్టు అధికారులు చెబుతున్నారు. కొందరు పర్సనల్​గా కంప్లయింట్స్​ ఇస్తుండగా.. మరికొందరు ఈ మెయిల్స్, పోస్టుల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారు. అంతకంటే ముందు కూడా ఈ నిర్మాణాలపై సర్కారుకు ఫిర్యాదులు అందాయి. పాతవాటితోపాటు కొత్త కంప్లయింట్స్​ను కూడా జత చేసుకొని

 అప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న ఇల్లీగల్​ కన్​స్ర్టక్షన్స్ జాబితాలోని వివరాలతో సరిపోల్చుకుంటున్నారు.  ఓఆర్ఆర్​ వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉన్నది. దీంతో ఆ ప్రాంతం వరకు ఎన్ని చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయి ? వరద కాలువల ప్రవాహం ఎట్లా పోతుంది ?  వాటి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లు ఎక్కడి వరకు ఉన్నాయి ? అనే సమాచారం అంతా ఇప్పటికే హైడ్రా దగ్గర ఉన్నది. దీంతోపాటు తాజాగా  శాటిలైట్​ జీఐఎస్​ సర్వేను కూడా  వినియోగించుకొని, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నది. 

ఇంకోవైపు కూల్చివేతలపై రాష్ట్ర సర్కార్​ కు జనాల నుంచి సానుకూల స్పందన వస్తున్నది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తుండటంతో బిల్డింగ్స్​లకు పర్మిషన్లు ఇచ్చే సమయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇరిగేషన్​ శాఖ ఆఫీసర్లు జాగ్రత్తగా ఎన్​వోసీలు ఇవాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట్టు సమాచారం. 

అక్రమమా? కాదా? తేల్చేందుకు స్పెషల్​ టీం 

హైడ్రాకు అక్రమ నిర్మాణాలపై వస్తున్న ప్రతీ కంప్లయింట్​ను పరిశీలించేందుకు స్పెషల్​ టీం పనిచేస్తున్నది. జీహెచ్ఎంసీతోపాటు హెచ్​ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇరిగేషన్ డిపార్ట్​మెంట్లతో కూడిన ఆఫీసర్లు ప్రతి ఫిర్యాదును అన్ని రకాలుగా చెక్​ చేస్తున్నారు. ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్ల మ్యాప్​లు, శాటిలైట్​ ఇమేజ్​లతోపాటు కంప్లయింట్​లో ఒక్క అక్రమ నిర్మాణమే పేర్కొంటే.. ఒక్కటే ఉన్నదా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే దానిపై క్షేత్రస్థాయిలో ఫీల్డ్​ వివరాలు  తెప్పించుకుంటున్నారు. 

పర్మిషన్లు తీసుకుని కట్టారా? లేక ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్​గా నిర్మాణమే చేపట్టారా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎన్​వోసీలు తీసుకొని, పర్మిషన్లతో ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్​లో అక్రమ నిర్మాణాలు కడితే.. వాటికి ఎలా పర్మిషన్లు ఇచ్చారు ? ఎవరు ఇచ్చారు ? సరైన పర్మిషనా? లేక ఒత్తిడితో ఇచ్చారా ? అనే విషయాలు తెలుసుకుంటున్నారు. గత పదేండ్లలో ఇచ్చిన పర్మిషన్లయితే.. ఏ అధికారి ఇచ్చారో వారి వివరాలు తీసుకొని

 చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  తప్పుడు పర్మిషన్లు అయితే.. ఏ మాత్రం ఆలోచించకుండా కూల్చివేతలకు వెళ్తున్నారు. కోర్టుల్లోనూ ఆ తప్పుడు  పర్మిషన్లు చూపి ప్రభుత్వ శాఖలే ఇచ్చాయనే చెప్పే అవకాశం ఉండడంతో.. వాటిని రద్దు చేయనున్నట్టు తెలుస్తున్నది.

అన్నీ బడాబాబులవే

చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో, 111 జీవో పరిధిలో  ఇల్లీగల్​ నిర్మాణాలు చేపట్టిన వాళ్లలో ఎక్కువ శాతం బడాబాబులే ఉన్నట్టు హైడ్రా ప్రాథమికంగా తేల్చింది. ఇదే విషయమై హైడ్రా గవర్నింగ్​ బాడీలో చైర్మన్​గా ఉన్న సీఎం రేవంత్​ రెడ్డికి అధికారులు వివరించారు.  గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో 95 శాతం బడాబాబులవే ఉన్నాయి.  కొందరు ఫామ్​హౌస్​లు కట్టుకోగా.. మరికొందరు కమర్షియల్​ పర్పస్​లో నిర్మాణాలు చేపట్టారు. కొందరు అపార్ట్​మెంట్స్​ నిర్మించారు.  కాగా, హైడ్రా ఏర్పాటు చేసిందే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అని, ఎవరున్నా సరే.. 

నిబంధనలకు అనుగుణంగా కూల్చివేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ ఇప్పటికే సీఎంతోపాటు ఆయన బంధువులు, మంత్రులు, ఉన్నతాధికారులపై ఒత్తిడి మొదలైంది. అయితే, ఈ విషయంలో ఎవరూ కలుగజేసుకునేది లేదని, తన సొంత వారివి ఉన్న కూల్చివేత తప్పదని రేవంత్​రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో అన్నట్టు తెలిసింది. ఇప్పటికే 30కు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 

సర్కార్​కు పాజిటివ్ టాక్​

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాష్ట్ర సర్కార్​కు పాజిటివ్​ టాక్​ వస్తున్నది. గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడిన వీడియోలను సోషల్​ మీడియాలో నెటిజన్లు వైరల్​ చేస్తున్నారు. ‘శభాష్​ రేవంత్​ సర్కార్’​ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో హైడ్రా ఆరంభ శూరత్వం ప్రదర్శించకూడదని, అక్రమ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేయాల్సిందేనని కోరుతున్నారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తుండడంతో ఈ విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకు కదులుతున్నది. ఒకవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ప్రభుత్వానికి మద్దతు లభిస్తుండడంతో.. 

అధికారులు ఇప్పుడిస్తున్న బిల్డింగ్​ పర్మిషన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏమాత్రం ఏమరపాటుగా ఎఫ్ టీఎల్​, బఫర్​ జోన్లలో పర్మిషన్లు ఇస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పినట్టు సమాచారం. అలాంటివేమైనా జరిగితే సర్వీస్​ రిమూవల్​ తప్పదని హెచ్చరించినట్టు ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు. అదే సమయంలో గతంలో అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకునే విషయమైన ఆలోచిస్తున్నట్టు తెలిపారు.