లీడర్లు అమ్మిన్రు.. ఆఫీసర్లు కూలుస్తున్నరు.!

లీడర్లు అమ్మిన్రు.. ఆఫీసర్లు కూలుస్తున్నరు.!
  • పీర్జాదిగూడ కార్పొరేషన్​లో భారీగా వెలిసిన నిర్మాణాలు
  • సీలింగ్​ భూముల్లో ఇండ్లు కట్టారంటూ అధికారుల కూల్చివేతలు  
  •  లక్షలు పోసి కొని కట్టుకుంటున్నామని  బాధితుల ఆందోళన
  • కూల్చివేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. ఉద్రిక్తత 

మేడిపల్లి, వెలుగు :  ఓ పార్టీ లీడర్లు అమ్మితే.. నమ్మిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి ఇండ్ల నిర్మించుకున్నారు. చివరకు అవి సీలింగ్ భూముల్లో కట్టారని, అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కూల్చివేస్తున్నారు. మరోవైపు తాము లక్షలు పోసి కొనుగోలు చేసి ఇండ్లను కట్టుకున్నామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి సాలార్ జంగ్ కంచెలోని సర్వే నంబర్.1 లోని సీలింగ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. దీంతో పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, నేతలు  అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. మేడిపల్లి తహసీల్దారు హసీనా ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలకు మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలే

 కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకోగా..  మరికొందరిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మారకపోతుండడంతో ఆస్తులకు నష్టం కలిగించేలా చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. అన్ని పర్మిషన్లు ఉన్నా.. సీలింగ్ ల్యాండ్ పేరుతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యనే. తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుట్ర రాజకీయాలకు  పాల్పడుతున్నాడు.  

 జక్క వెంకట్ రెడ్డి, పీర్జాదిగూడ  కార్పొరేషన్ మేయర్

సామాన్యులను బలి చేయడం సరికాదు 

సీలింగ్ ల్యాండ్ హద్దుల నిర్ధారణలో  ఏండ్లుగా రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది.  ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడే రెవెన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు విచారణ చేయలేదు ?. పీర్జాదిగూడ కార్పొరేషన్ లో మారిన రాజకీయ పరిణామాల కారణంగా అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు ప్రజలను భయపెట్టి లక్షల్లో వసూలు చేశారు. అధికార మార్పుతో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కూడా అదే ధోరణిలో కూల్చివేతలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

– ఎన్.సృజన, సీపీఎం మండల కార్యదర్శి

రిపోర్ట్ ఆధారంగానే కూల్చివేశాం 

 ప్రభుత్వ సీలింగ్ భూమిలో నిర్మించడంతోనే  కూల్చివేశాం. సర్వే నంబర్. 1లో  6.10 ఎకరాల సీలింగ్  భూమి ఉంది. దీనిపై  ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేశాం. వారి ఆదేశాలతోనే కూల్చివేశాం.  

–  హసీనా, మేడిపల్లి తహసీల్దారు