
- పంచాయతీ రాజ్‌శాఖలో బ్లాక్మెయిల్ దందా
- సాకులతో ఉద్యోగుల నుంచి ఎడాపెడా వసూళ్లు
- ఆ శాఖ హెచ్ఓడీలకు ఫిర్యాదుల వెల్లువ
- రంగంలోకి ఇంటెలిజెన్స్.. సర్కారుకు నివేదిక
మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో పంచాయతీ రాజ్‌శాఖలో బ్లాక్మెయిల్ దందా నడుస్తోంది. అధికారుల ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వివిధ సాకులతో ఉద్యోగుల నుంచి ఎడాపెడా వసూళ్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. అధికారుల అక్రమ దందపై ఆ శాఖ హెచ్ఓడీలకు ఫిర్యాదుల వెల్లువెత్తగా... ఇంటెలీజెన్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. వచ్చిన ఆరోపణల ఆధారంగా ఫీల్డ్ లెవల్లో ఎంక్వైరీ చేసి సదరు అధికారుల అక్రమ దందాపై సమగ్ర నివేదిక రూపొందించి సర్కారుకు అందించేందుకు సిద్దమవుతున్నట్టు తెలిసింది.
త్వరలోనే అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఓ ఆఫీసర్, ఎంప్లాయిస్‌యూనియన్ ప్రెసిడెంట్కుమ్మకై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి సదరు డిపార్ట్ మెంట్ లో పనిచేసే మండల, గ్రామ స్థాయి అధికారులను బెదిరించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పైసలు గుంజుతున్నట్టు తెలిసింది. మీపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ కు రిపోర్ట్ పెడితే.. సస్పెండ్ అవుతారని ఉద్యోగులను బ్లాక్‌మెయిల్‌చేసి ఎంతో కొంత ముట్టజెప్పి సెటిల్ మెంట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారట.
తమపై కలెక్టర్‌కు రిపోర్ట్ పంపితేఎక్కడ తమ ఉద్యోగానికి ఎసరు వస్తుందోనని భయపడి వారు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరిస్తుండగా, సదరు ఉద్యోగ సంఘం అధ్యక్షుడే మధ్య వర్తిగా ఉండి సెటిల్మెంట్ చేస్తున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉద్యోగం చేసే సదరు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఎప్పుడూ కలెక్టరేట్ లోని జిల్లా ఆఫీస్ లోనే ఉంటూ పైరవీలు, సెటిల్ మెంట్లతో కాలం గడుపుతున్నారే ఆరోపణలున్నాయి.
ఇలా అక్రమ వసూళ్లు..
ఇద్దరు ఉద్యోగులు తాము పనిచేస్తున్న మండలం నుంచి నేషనల్హైవే మీద ఉన్న మండలాలకు ట్రాన్స్ఫర్ చేసేందుకు సదరు ఆఫీసర్, యూనియన్ ప్రెసిడెంట్ రూ.లక్ష చొప్పున లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. మెదక్ డివిజన్ పరిధిలోని ఓ మండల అధికారికి ఫోన్‌చేసి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదు వచ్చింది, కలెక్టర్‌కు నివేదిక పంపిస్తున్నానని చెప్పడంతో అతడు బయపడి బతిమిలాడి రూ.20 వేలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి సస్పెన్షన్ఎత్తేసి మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.20 వేలు తీసుకున్నట్టు సమాచారం.
ఆ డిపార్ట్మెంట్ పరిధిలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా, వారికి ఉత్తర్వులు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.25 వేలు తీసుకున్నారే ఆరోపణలున్నాయి. 58, 59 జీవో కింద ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి రెగ్యులరైజ్ చేసే విషయంలో దరఖాస్తు దారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది.
సదరు ఆఫీసర్ పొరుగున ఉన్న జిల్లాలో కొత్త ఇంటి నిర్మాణం చేస్తుండగా అతడితో సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జిల్లాలోని ఆ శాఖ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక పంపించినట్టు తెలిసింది.
సీక్రెట్‌గా ఎంక్వైరీ
పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న ఆఫీసర్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడి అవినీతి బాగోతంపై ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదులు అందగా కొద్ది రోజులుగా సీక్రెట్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు? ఎవరి దగ్గర? ఎంతెంత? వసూలు చేశారనే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం. తదనుగుణంగా అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.