- గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు
- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోకి నిబంధనలకు విరుద్ధంగా గడ్డిమందు (గ్లైఫోసెట్) వస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఈ మందును అమ్ముతున్నారు. ఇటీవల భద్రాచలం బ్రిడ్జి పాయింట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక ట్రాలీ ఆటోలో అశ్వాపురం మండల కేంద్రానికి తరలిస్తున్న 300 లీటర్ల గడ్డి మందును పట్టుకున్నారు.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
గడ్డి, కలుపు నివారణకు వాడే ఈ మందులు ఏకంగా పంటలనే నాశనం చేస్తున్నాయి. పొలాలు దుక్కిదున్ని నాట్లు వేసినప్పటి నుంచి కోతలు వరకు కలుపు సమస్య తీరడం లేదు. కూలీల సమస్య ఉండటంతో రైతులు కలుపు నివారణ మందులపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏ మందులు వాడాలో తెలియని రైతులు అవగాహన లేక ఎరువుల వ్యాపారులు ఇచ్చే మందులు కొట్టి తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా చోట్ల గతేడాది కంది, వరి పొలాల్లో కలుపు నివారణ మందులు వాడితే పచ్చటి పొలాలు మాడి మసయ్యాయి. గిరిజన జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వ్యవసాయశాఖ ఆఫీసర్లు అంటీఅంటనట్లుగా వ్యవహరిస్తున్నారు.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
కలుపు మొక్కలు, గడ్డి నివారణకు వాడే గ్లైఫోసెట్మందు రైతుల పాలిట శాపంగా మారడంతో వీటి అమ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తొలుత పూర్తిగా నిషేధం విధించినా, కోర్టు ఉత్తర్వుల మేరకు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య మాత్రమే అమ్మాలని నిబంధనలు పెట్టారు. ఇందుకు వ్యవసాయశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహార,వాణిజ్య పంటలపై దీన్ని వాడకూడదు. బీడు భూముల్లో మాత్రమే స్ప్రే చేయాలి. గ్లైఫోసెట్పై ఆంక్షలు పెట్టడంతో రకరకాల పేర్లతో మందులను మార్కెట్లోకి కంపెనీలు ప్రవేశపెట్టాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి విచ్చలవిడిగా తీసుకొస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో వీటిని దాచి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ మందులు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొనడంతో గడ్డిమందుపై వ్యవసాయశాఖ ఆంక్షలు పెట్టింది. పర్యావరణానికి కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.