అక్రమ హోర్డింగులు, బిల్ బోర్డులపై భారీగా జరిమానాలు

అక్రమ హోర్డింగులు, బిల్ బోర్డులపై భారీగా జరిమానాలు

హైదరాబాద్ : సిటీలో అక్రమ హోర్డింగులు, బిల్ బోర్డులపై కఠినంగా వ్యవహరిస్తోంది GHMC. నగరంలోని మాల్స్, దుకాణాలు, ప్రైవేట్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ కు లక్షల రూపాయల జరిమానా వేస్తున్నారు అధికారులు. జీవో 68ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు రూల్స్ బ్రేక్ చేసే వారిపై చర్యలకు సిద్దమవుతున్నారు. హైదరాబాద్ సిటీలో నిబంధనలకు విరుద్దంగా… రోడ్లపై వెలుస్తోన్న హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లపై చర్యలకు దిగింది GHMC. హోర్డింగ్స్ అతిక్రమణలను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 68ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…సిటీలో ఉన్న మాల్స్, షాప్స్ దగ్గర ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, నేమ్ బోర్డులపై ఫోకస్ పెట్టారు అధికారులు. వాటిని తొలగించాలని నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు జనం నుంచి సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులపైనా దృష్టిపెడుతున్నారు.

గతంలో రూల్స్ బ్రేక్ చేసిన వారికి నామమాత్రపు ఫైన్లు వేసిన అధికారులు…ఇప్పుడు భారీగా జరిమానాలు వేస్తున్నారు. సంస్థలు ఏర్పాటు చేసిన హోర్డింగుల ఆధారంగా ఫైన్లు వేస్తున్నారు. అమీర్ పేట దగ్గర ఉన్న చెన్నై షాపింగ్ మాల్….15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్ పెట్టడంతో 4లక్షల రూపాయల ఫైన్ విధించారు అధికారులు. నిజాంపేట్ క్రాస్ రోడ్డులో ఉన్న జీపీఆర్ మల్టిప్లెక్స్ కు 3 లక్షలు, పంజాగుట్ట ఎల్జీ షోరూంకు రెండు లక్షలు, సికింద్రాబాద్ లో ఓ ఫర్నీచర్ షాపునకు 2 లక్షలు, అమీర్ పేట వీఆర్కే సిల్క్స్ కు రెండు లక్షలు, ఎస్ఆర్ నగర్ రిలయన్స్ డిజిటల్ కు లక్ష, బజాజ్ షోరూం కు లక్షన్నర, లక్డికాపూల్ ఇంపీరియల్ రెస్టారెంట్ కు లక్ష రూపాయల ఫైన్ వేశారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించేందుకు జీవో 68ని తీసుకొచ్చింది ప్రభుత్వం. హోర్డింగ్స్ గ్రౌండ్ లెవల్  నుంచి 15 అడుగులకు మించకూడదని నిర్ణయించింది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే…పది వేల నుంచి లక్ష వరకు ఫైన్ విధించే అవకాశం లోకల్ బాడీలకు ఇచ్చింది. దీంతో భారీగా ఫైన్లు వేస్తున్నారు అధికారులు.