అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తా: ప్రధాని మోడీ

అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తా: ప్రధాని మోడీ

అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ తెల్లవారు జామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. 

ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంటును సైతం స్తంభింపజేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన మోదీ ట్రంప్‎తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. 

ALSO READ | తమ్మడు తమ్ముడే పేకాట..పేకాటే..! ఇదీ ట్రంప్ లెక్క

ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్‌ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అమెరికాలో చమురు, గ్యాస్‌ వాణిజ్యంపైనా దృష్టిపెడతాం. 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం’అని తెలిపారు.